Day 179 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను (ప్రకటన 4:1).

యోహాను పత్మసు ద్వీపంలో ఉన్నాడు. మనుష్య సంచారం లేదు. అంతా రాతి నేల. దేవుని వాక్యాన్నీ, క్రీస్తు సువార్తనీ ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగారవాసం వీధించారు. ఎఫెసులోని తన స్నేహితులకి దూరమై, సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై, పోకిరితనం, శత్రుభావం మూర్తీభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి.

యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలు పెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేలమీద పడుకున్నాడు. కాని అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన, దానికి పైగా దేవుని దర్శనాన్ని చూసాడు.

వీళ్ళేకాదు చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకలాటి దర్శనం రావడం ఆశ్చర్యమే.

ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానమూ శ్రమలు పొందేవారికి, మరణ శయ్యలకి అంకితమై పోయినవారికి, ఒంటరి బాటసారులకీ, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండికూడా ఇంటి పనిభారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇల్లాళ్ళకి, ఈ తలుపులు తెరుచుకుని ఆహ్వానాన్నిచ్చాయి.

అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి. హృదయశుద్ధి ఉండాలి. విశ్వాసంలో విధేయత ఉండాలి. క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్నీ నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధంగా మన సమస్తమూ దేవుడే అయినప్పుడు, మన జీవితం, నడత తీరుతెన్నులూ ఆయనకంగీకారమైనప్పుడు మనకోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి.

దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి
విశ్రమించమన్నాడక్కడ కొంతసేపు
శుభ్రమైన గాలి వీచే కొండ చరియలు
ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు.

దేవుని ఎడారులు విశాలంగా
గోధుమ వన్నెలో ఉన్నాయి
అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం
అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు.