నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలముకొరకును, యుద్దముకొరకును యుద్దదినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? (యోబు 38:22,23).
మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు. చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం. ఇక పై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మనపట్ల కనపరచడానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి, ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెదకినట్లయితే మన జీవితమంతా విశ్రాంతి, ప్రోత్సాహం, వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది. అప్పుడు ప్రతి కారుమేఘమూ ఇంద్రధనుస్సు అయిపోతుంది. ప్రతి పర్వతమూ మన స్వర్గారోహణకి దారినిస్తుంది.
మనం ఒకసారి వెనక్కు తిరిగి మన జీవితాలను పునరావలోకనం చేసుకుంటే మనలో చాలామందికి ఒక విషయం స్పష్టమౌతుంది. అదేమంటే మన పరమ తండ్రి మనకు తన కృపనూ, విస్తారమైన దీవెనలనూ ఇవ్వడానికి ఎలాటి సమయాలను ఎన్నుకున్నాడంటే మనం పూర్తిగా వేసారిపోయి, అన్ని వైపులనుండి దారి మూసుకుపోయిన సమయాలను దేవుని నుండి విలువైన ఆభరణాలను నల్లబట్టలు వేసుకున్న సేవకులు మురికిగా ఉన్న పెట్టెలో పట్టుకొస్తుంటారు. అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరబోతున్న పెండ్లికొడుకు పంపిన సిరులన్నీ ఉంటాయి.
చీకటిలో ఆయనపై నమ్మకముంచండి. మనకు అర్థంకాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచండి. పాము కుబుసం విడిచి క్రొత్త తేజస్సునూ, శక్తినీ పొందినట్టు ఇలాటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవ్వనం, ఉత్సాహం మనకు దొరుకుతాయి.
దేవుడు చూసినట్టు రేపులోకి
మనంకూడా తొంగి చూడగలిగితే
ఇప్పటి ఈ దుఃఖం మనల్నేం చెయ్యదు
ఆనందాలెదురుచూస్తున్నాయి
దుఃఖాలు తెరమరుగౌతాయి
దేవుడికి తెలిసినట్టు రేపులో
ఏముందో మనకీ తెలిస్తే
చీకటివెంట వెలుగొస్తుందని
మసకదారులు రాజబాటలౌతాయనీ
ఏం చేస్తాయి ఇప్పటి ఈ కన్నీళ్ళు మనల్ని
ముందేం కానున్నదో తెలిస్తే బావుణ్ణు
అంటాము కాని, ప్రేమతో దేవుడు
దాన్ని రహస్యంగానే ఉంచాడు
తెలియదు కాబట్టి మరింత దృఢ సంకల్పంతో
నడవాలి ఆయన వెంట