వివాహ బంధం 3


  • Author: Bharathi Devadanam
  • Category: Family
  • Reference: Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4

ఏవండీ! కాఫి తీసుకోండి అంటూ కాఫీ కప్పుతో హాల్లో ప్రవేశించింది తబిత. అయితే సురేష్ సెల్ఫోన్లో ఏవో మెసేజ్ కొడుతూ, దానిలో లీనమైనట్లున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తబిత మాట వినలేదు. ఏమండీ! అంటూ పిలుస్తూ దగ్గరకు వచ్చే సరికి, ఒక్కసారిగా తడబడి సెల్ ఫోన్ ఆఫ్ చేసేశాడు. ఎవరితోనండీ.. చాటింగ్ అంటూ తబిత చనువుగా సెల్ చేతిలోకి తీసుకుంది. తన కలల ప్రపంచంలోకి ఎవరో చొరబడినట్లుగా తీవ్ర అసంతృప్తికి గురియైన సురేష్, అన్నీ నీకు కావాలా అంటూ విసుక్కుని అక్కడినుండి లేచి వెళ్లిపోయాడు. సంగతి అర్థమయింది తబితాకు. అవతలవైపు ఉన్నది లీల అని గ్రహించింది. లీల కూడా క్రిస్టియన్. సురేష్ వాళ్ల కొలీగ్. తనకు ఇంట్లో ఎదురయ్యే సమస్యలు సురేష్ తో చెప్పుకుంటూ ఉండేది. అలా అలా ఆ పరిచయం ఇద్దరి మధ్య స్నేహానికి, చనువుకు దారి తీసింది. లీల తబితాకు కూడా బాగా పరిచయమే. సురేష్ ని ప్రశ్నిస్తే “నా మనసు నిర్మలంగా వుంది. లీల మనసులో కూడా ఏ కల్మషంలేదు. నన్ను ఒక బ్రదర్ లాగ, ఫ్రెండ్ లాగ అనుకుంటుంది” అంటాడు. మాలో ఏ తప్పూ లేదు అని సురేష్, లీల భావిస్తున్నట్లు ఈ రోజుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు. లోకం లో వివాహితులైన స్త్రీ పురుషులమధ్య చాలా ఈ రకమైన స్నేహాలు ఉంటాయి. కాని పవిత్రమైన క్రైస్తవ వివాహ బంధంలో ఉన్నవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తాగా ఉండాలి. ఎందుకంటే మనల్ని నిశితంగా పరిశీలిస్తూ, ఇలాంటి స్నేహాలు అనే వలలు మనమీదకు విసిరే ఒక అజ్ఞాత శత్రువు సాతాను మనకు ఉన్నాడు.

పరిచయాలు పెరిగి స్నేహంగా తర్వాత అక్రమ సంబంధంగా మారి, సాతాను ద్వారా తమ జీవితాలను మానసికంగా, శారీరికంగా, ఆత్మీయంగా పాడు చేసుకున్న క్రైస్తవులను, విశ్వాసులను అనేకమందిని మనం చూస్తున్నాము. తన చుట్టూ అనేక మంది స్త్రీలు ఉండగా, పరాయి పురుషుడు మాత్రమే తన బాధలు చెప్పుకోడానికి యోగ్యుడుగా లీలకు అనిపించాడా! అలాగే పురుషులు కూడా... పరాయి స్త్రీ తో తన కష్టాలు చెప్పుకోవలసిన అవసరం ఉందా? ఏం! ఎందుకు చెప్పుకోకూడదు. అది తప్పా! అని మీరు అడగవచ్చు. “దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్లెను” అని ఆది 34:1 లో ఉంది. అది తప్పా! అయితే 2వ వచనం లో ఆమె కథ ముగిసిపోయింది. కాబట్టి, వివాహ జీవితంలో వేసే ప్రతీ అడగు అది తప్పటడుగుగా కాకుండా చూచుకొనే భాద్యత భార్య, భర్త ఇద్దరి పైనా ఉంది.

అనేక కుటుంబాలు ఈ రోజు ఈ వలలో చిక్కుకొని బయటకు రాలేక బాధపడుతున్నారు.”ప్రతీ వానికి సొంత భార్య ఉండవలెను ప్రతీ స్త్రీ కి సొంత భర్త యుండవలెను”. ఒక పురుషుడు ఒక భార్య. అది దేవుని న్యాయం. I కోరింథీ 7వ అధ్యాయంలో పౌలు భార్యా భర్తల సంబంధాన్ని చక్కగా వివరించాడు. మరణ పర్యంతము వివాహం నిలచి యుంటుంది. కాబట్టి వివాహ బంధంలో ఒకరికి ఒకరు కట్టుబడి యుండుట చాలా ముఖ్యమైన విషయము. మలాకీ 2:14-16 లో పరిశుద్ధాత్మ దేవుడు భార్యా భర్తలు ఒకరి యెడల ఒకరు ఎలా యదార్ధ హృదయులుగా వుండాలో మనల్ని హెచ్చరిస్తున్నాడు.

దయచేసి పరాయి స్త్రీ మోజులో నుండి, లేక పర పురుషుని ఆకర్షణలో నుండి బయటకు రండి. స్వంత పురుషునితో కాకుండా, వేరే పురుషునితో ఉంటే అది వేశ్యత్వమే. సామెతలు 22:14 లో వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును అని వ్రాయబడింది. యేసు ప్రభువు యొక్క రక్తములో కడుగ బడిన ప్రతీ క్రైస్తవుడు, ప్రతీ విశ్వాసి ఈ మాటలను గ్రహించి యెహోవా ఆశీర్వాదములో నిలచి యుండును గాక.