పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి (1 కొరింథీ 16:13).
జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్ధించకండి. బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి. మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దాన్లో ఆశ్చర్యం ఏముంది? దేవుడు మీచేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు.
మనం స్థిమితంగా, తేలికగా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనలను గొప్పవాళ్ళుగా ఎప్పటికీ చెయ్యడన్నది గుర్తుంచుకోండి. అలాటి జీవితం క్రిందికి నడిపిస్తుందేగాని ఔన్నత్యానికి నడిపించదు. పరలోకం మనకు పైగా ఉంది. మనమెప్పుడూ పైనున్న పరలోకంవైపు చూస్తూ ఉండాలి. కొందరుంటారు, వాళ్ళు త్యాగం, సంయమనం, నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్ళనే వెళ్ళరు. కాని శ్రమించి పనిచేయ్యడం, కష్టాలకు ఓర్చుకోవడం.. ఇవే ఔన్నత్యానికి సోపానాలు. పచ్చిక మైదానాలగుండా ఎవరో మనకోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదుగా వెళ్లే గొప్పవాళ్ళం కాలేము. నీ స్వహస్తాలతో రాళ్ళు చదును చేసుకుని దాని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు.
ఆటపాటలకి తాగితందనాలాడడానికీ
గాలిమేడలు కట్టడానికీ కాదిది సమయం
కష్టపడే కాలమిది
పోరాటానికి ముఖం చాటు చెయ్యొద్దు
అది దేవుని వరం
దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు
రోజులు మంచివి కాదు అంటూ నిట్టూర్చకు
ఎవరిది తప్పు!
లేచి నిలబడు ధైర్యం తెచ్చుకో
దేవుని పేరిట గొంతెత్తి మాట్లాడు
సిగ్గుపడకు బలవంతుడివై ఉండు
దుష్టులు ఎంతగా వర్థిల్లుతున్నారో చూడకు
యుద్ధమెంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు
నిస్పృహ చెందకు పోరునుంచి నిష్క్రమించకు
రేపే నీ విజయభేరి మ్రోగుతుంది.
బలవంతుడివై ఉండు