ఉత్తరవాయువూ, ఏతెంచుము. దక్షిణవాయువూ, వేంచేయుము. నా ఉద్యానవనముమీద విసరుడి. దాని పరిమళములు వ్యాపింపజేయుడి (పరమ 4:16).
ఈ ప్రార్థనలోని అర్థాన్ని ఒక్క క్షణం ఆలోచించండి. పరమళాన్నిచ్చే చెట్టులో సుగంధం నిద్రాణమై ఉన్నట్టే, ఎదుగుదల లేని క్రైస్తవ హృదయంలో కూడా కృప నిరుపయోగంగా పడి ఉంటుంది. ఎన్నెన్నో జీవితాలున్నాయి. అయితే వాటిలో నుంచి పరిశుద్ధ శ్రమల సువాసనలూ, దైవాత్మపూరితమైన సత్కార్యాల పరిమళం రాదు. ముళ్ళ కంపలమీద, గంధపు చెట్టుమీద వీచే గాలి ఒక్కటే. కాని వాటిలో ఒక్కటే పరిమళాన్ని ఇస్తుంది.
ఒక్కోసారి దేవుడు తన పిల్లలమీదికి, వాళ్ళ సౌశీల్యం ఇనుమడించేందుకు గాను పెనుగాలుల్ని పంపిస్తుంటాడు. కాగడాలను అటూ ఇటూ బలంగా ఊపుతుంటే అవి ఉజ్వలంగా వెలుగుతాయి. సాంబ్రాణిని నిప్పులమీద వేస్తేనే సువాసన వస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలోని అతి ప్రశస్తమైన లక్షణాలు శ్రమలనే ఉత్తరవాయువు వీచి కొడితేనే బయటకి తెలుస్తాయి. గాయపడిన హృదయాలు దేవునికి ఇష్టమైన పరిమళాన్ని వెదజల్లుతాయి.
ఓ అందాల భరిణి ఉంది
నా ప్రేమంతా దాన్లో పెట్టి మూత బిగించాను
నా మదిలో భద్రంగా ఉంచాను
మూతైనా ఎప్పుడూ తియ్యలేదు
ఆవేదన నన్ను ఒకరోజు ఆవేశించింది
భారమై అది నా భరిణిపై బరువుగా పడింది
భరిణె బద్ధలైంది
నష్టానికి నా ప్రాణం ఉసూరుమంది
దిగులుపడుతుంటే కనిపించింది
దేవుడు చేసిన ఓ అద్భుతకార్యం
నా ప్రేమ పరలోకపు ప్రేమగా మారి
నా పొరుగువాళ్ళ వ్యధిత హృదయాలకు సేదదీర్చింది
ఓ స్వరం నా చెవిలో పలికింది
కుమారీ నీకు దొరికిన ఈ ఓదార్పుతో
వెళ్ళి ఇతరుల్ని ఓదార్చు
నాతో ధన్యకరమైన సహవాసాన్ని రుచిచూస్తావు
నా పగిలిన హృదయం
ప్రపంచాన్ని బాగుచేసింది కదా.