అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపపలెననియు... (అపో.కా 14:22).
జీవితంలోని శ్రేష్ఠమైన విషయాలు గాయపడడంవల్లనే లభిస్తాయి. రొట్టెను తయారు చెయ్యాలంటే గోధుమలను ముందుగా పిండిచెయ్యాలి. సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది. నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోషకారణం. జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలోనుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనేగాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు.
ముగ్ధ మోహన స్నిగ్ద గులాబీ పూచింది
తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు
వింత పరిమళం వెదజల్లింది
వర్షం కురిసినప్పుడు
చినుకుల తాకిడికి లేతరేకులు
చిందరవందరై పోయినప్పుడు
దాని గుబాళింపు అపూర్వం
ఆకుల్ని మునివేళ్ళతో నొక్కితే
మరింత తియ్యని సుగంధ సోయగం
ప్రభూ, కష్టకాలంలో
నా హృదయాన్ని పరిమళింప జెయ్యి
నా గుండెకోతని
నీ కిష్టమైతే అధికం చెయ్యి
నలిగిన పరిమళం
నా యెదలో వ్యాపిస్తుంటే
నీ ప్రేమను కొనియాడుతుంటాను
నువ్వు ఆదరించే వాడివిగా ఉండాలని కోరుకుంటే, ఇతరులకి సానుభూతి చూపించే శ్రేష్టమయిన వరాన్ని నువ్వు ఆశిస్తే, శోధనలకి గురైన హృదయాల్లో మాటసాయం మాత్రం కాక నిజమైన మేలు చెయ్యగలిగే శక్తి కావాలంటే, అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదుహృదయం నీకు ఉండాలంటే, ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది. నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి.