యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేను (ఆదీ 32:24).
యాకోబు దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు. ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనుష్య కుమారుడే. దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు. ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు. యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది. యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు. ఆయన మెడ పట్టుకుని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు, క్రొత్త జీవితంలో ప్రవేశించాడు. మనిషి దైవస్వరూపి అయ్యాడు. భూలోకం పరలోకానికి ఎదిగింది. తెల్లవారిన తరువాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఆకాశవాణి ప్రకటించింది, "నీవు దేవునితోను మనుష్యలతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు"
మారిన ప్రతి జీవితంలోను ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి. దేవుడు మనలను ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు, మనకందరికీ అత్యయిక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి. మనం చెయ్యగలమనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు, దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒకదాన్ని పరిత్యజించాలి, లోబడాలి. మన స్వంత జ్ఞానం, స్వనీతి, స్వశక్తి మొదలైనవాటిని విడిచి క్రీస్తుతోబాటు శ్రమలపాలై ఆయనతో కలసి తిరిగి లేవాలి. అత్యవసర పరిస్థితుల్లోకి మనల్నేలా తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు. బయటకి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు.
ఆయన నిన్నిలా నడిపిస్తున్నాడా? ప్రస్తుతం నీకున్న శ్రమలు, కష్టాలు, అసాధ్యమైన విపత్కర పరిస్థితులు.. వీటన్నిటి అర్థమీదేనేమో. ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడినది ఇందుకేనేమో. మరీ ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవెందుకు?
యాకోబు దేవుని వైపుకి తిరుగు, నిస్సహాయంగా ఆయన పాదాలమీద వాలిపో. నీ స్వశక్తిని, నీ జ్ఞానాన్ని తోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు. ఉన్నతమైన క్రొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడంద్వారానే నీకు విడుదల కలిగేది.
నీ పాదాలే శరణు
నా సర్వస్వం నీదే
జీవించినా మరణించినా
బాధలు గెల్చినా
చావు గెల్చినా
ప్రభువు కోసమే