కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి (అపొ.కా. 27:44).
మానవ జీవితకథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుతగాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి.
విశ్వాసపు దారి అంతా పూలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకుని వారిని బాధల దశలోనుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు. కాని వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. హేబెలు దగ్గరనుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షిసమూహ మేఘమంతటినీ పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్టసుఖాల కావడి కుండలే.
విశ్వాసి బాధలననుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ. దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతణ్ణి బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ పరిశుద్దుడైన అపొస్తలుణ్ణి శత్రువులనుండి తప్పించడానికి అగ్నితో, ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగి రాలేదు. అతణ్ణి బుట్టలో పెట్టి కిటికీలోగుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చెయ్యవలసి వచ్చింది. పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో, మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలోగుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకొనేందుకు పంపించెయ్యాల్సి వచ్చింది.
పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెలల తరబడి ఉన్నాడు. తాను ఆశతో ఎదురుచూసిన సమయాల గురించీ, ఉపవాసాల గురించీ, స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలూ, క్రూరమైన దెబ్బలు తినడమూ వీటన్నిటి గురించీ అతడు చెప్పాడు. ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తరువాత కూడా ఆ తుపాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది. చంపెయ్యాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది. చివరికి ఆ ఓడలోనుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళడానికి ఏ నావా అందుబాటులో లేదు. ఎగిసి పడుతున్న అలలను నిమ్మళింపజేయడానికి ఏ దేవతా ఆ నీటి మీద నడిచి రాలేదు. అద్భుత కార్యాలూ, సూచనలూ ఏమీ జరగలేదు. కాని ఒకడు తేలుతున్న కొయ్యదుంగను, మరొకడు విరిగిపోయిన చెక్క పలకనూ పట్టుకుని ఒడ్డుకి చేరవలసి వచ్చింది. ఏమీ దొరకనివాళ్ళు పళ్ళ బిగువున ఈదుకుంటూ పోవలసి వచ్చింది.
మన జీవితాలలో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే. దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే. అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే.
దేవుని వాగ్దానాలూ, దేవుని లీలలు మనలను దినదినమూ మనకేదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధినుండి బయటికి తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ, కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు.