నాకైతే తెలియదు మనలో ఎంతమంది ఈ శోధనను జయించ గలుగుతారో, నీవొక క్రైస్తావుడవో కాదో, నీ వెవరైనా సరే! నీవు ఏమి చేసినా సరే! శోధనపై విజయం పొందాలంటే కేవలం యేసు క్రీస్తు ప్రభువు సహాయం ద్వారానే ఇది సాధ్యం. ఈ లోకంలో ఉన్న మానవులు అనేకమంది ఈ శోధనలను జయించలేక ఇబ్బందులు పడుతూ కొంతమంది వాటిని తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ జీవితాలను విచ్చిన్నం చేసుకున్న వారి సంగతి తెలిసిందే. శోధనలు అనేది కొత్త సంగతి ఏమి కాదు గాని ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించుటకు నాలుగు బలమైన ఆయుధములు మన చేత ఉంటే తప్పకుండా శోధనను జయించ గలుగుతాము అని ఆశకలిగి వ్రాస్తున్నాను.
మొదటి ఆయుధం : మన బలహీనతలను తెలుసుకొని వాటినీ జయించుటకు ప్రార్ధన చేయాలి. మనం బలహీనులము శక్తిలేని వారము అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు కూడా శోధనను జయించనే జయించలేరు. అంతకంటే ముందుగా ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు ప్రభవునందు విశ్వాసముంచుతామో అప్పుడే పాపము అనే బంధకాల నుండి మనకు విడుదల కలుగుతుంది. అప్పుడే ఆయన మనకు సహాయపడేవాడుగా ఉంటాడు. యేసు క్రీసు ప్రభువు కూడా అనేక శోధనలగుండా వెళ్లాడు కాని ఎన్నడు కూడా పాపం చేయలేదు. కాబట్టి మనం ఏ విధంగా అలోచిస్తామో ఆయన ఎరిగియున్న దేవుడు. ఈ మొదటి ప్రార్ధన అనే ఆయుధం మనలో ఒక శక్తిని నింపుతుంది, ఈ ప్రార్ధన ద్వారా దేవునికి మన బలహీనతలను, మనం పడిపోయే సందర్భాలను తెలియజేసినప్పుడు ఆయన బలపరచే వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎదుట తాగ్గించుకొని ఉంటే తన ఉచితమైన కృపను అనుగ్రహించి శోధనను ఎదుర్కొనే శక్తిని అనుగ్రహిస్తాడు. “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి;” మత్తయి 26:41
రెండవ ఆయుధం : బైబిలు గ్రంథంలో శోధనను జయించుటను గూర్చి ఏ యే సంగతులను వ్రాయబడ్డాయో వాటిని చదివి ధ్యానించాలి. దేవుని వాక్యం అనేది బలమైన ఆయుధం. బైబిలు గ్రంథంలోనీ కొన్ని వచనాలను గమనిస్తే “యవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు?” కీర్తనలు 119:9. “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.” కీర్తనలు 119:11. “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?” యోబు 31:1. “..జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” I కోరింథీ 6:18-20.
మూడవ ఆయుధం : కోరికలు పుట్టించు వాటికి దూరముగా ఉండడం శ్రేయస్కరం. “నీవు యావనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.” II తిమోతి 2:22. అనగా లౌకిక సంబంధమైన సినిమాలనుండి మరియు సంగీతముల నుండి, మన దృష్టిని మళ్ళించు పత్రికలు మరియు పుస్తకములనుండి, దుర్భాషలు పలుకు స్నేహితులనుండి, పరిశుధ్ధముగా జీవించలేని ప్రదేశములనుండి దూరముగా నుండడం గొప్ప భాగ్యం. ఎప్పుడైతే వీటికి దూరంగా ఉంటామో అప్పుడే మనం దేవునితో సత్ సంబంధం కలిగి ఉంటాము మరియు పరిపూర్ణమైన జీవితం, మంచి నడవడి, చక్కని అలవాట్లు, మంచి తలాంతులు, దేవుని ప్రజల పట్ల విధేయత, శుద్ధ మనసుతో జీవించగలుగుతాము. “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” సామెతలు 4:23.
నాలుగవ ఆయుధం: మన జీవితంలో జరిగినటువంటి ఇట్టి సంగతులను ఎవరైనా తోటి క్రైస్తవ బిడ్డలతో పంచుకోవాలి. ఎవరైతే ఇట్టి శోధనను జయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారితో స్నేహం చేయడం శ్రేయస్కరం. ఒక నమ్మకమైన స్నేహితునితో లేక దైవ సేవకునితో ఈ విషయాలను పంచుకున్నప్పుడు వారు మనకొరకు ప్రార్ధన చేసి మంచి సలాహాలను ఇచ్చేవారుగా ఉంటారు. “మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.” యాకోబు 5:16.
ప్రియ చదువరీ, ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం మనం శోధనను జయించగలమో లేదో అనే సందేహం ఉండవచ్చు . కాని మన హృదయ ఆలోచన మదిలో తలంపులు రెండు ఒకదాని వెంట ఒకటి వచ్చును. కాబట్టి సరియైన తలంపులను ఎంచుకొనుటలో ప్రాయాసపడడానికి ఎన్నడు వెనుకంజ వేయకూడదు సుమీ!. ఈ ఆయుధాలను ఉపయోగించుటలో ప్రభవు మనకు సన్ మార్గమును తెలియజేసి శోధలను జయించుటకు పరిశుద్ధాత్మ బలమును అనుగ్రహించి పరిపూర్ణమైన జీవితం జీవించుటకు మనకు సహాము చేయును గాక!. ఆమేన్!.