చూడక నమ్మినవారు ధన్యులు (యోహాను 20:29).
కళ్లకు కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి! అందుకే కనిపించని విషయాలపై మనస్సు లగ్నం చెయ్యమని దేవుడు పదేపదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రంమీద నడవాలని ఉంటే నడవాలి. ఈత కొట్టాలని అనిపిస్తే ఈత కొట్టాలి. రెండు పనులు చెయ్యడం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు, కంచెలు అడ్డులేకుండా చూసుకోవాలి. దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాకుండా ఎందుకైనా మంచిదన్నట్టు నేలకి దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు.
దేవుడు అబ్రాహాముకు తన స్వశక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు. తన శరీరంతో తానేమీ చెయ్యలేనని, కేవలం దేవుని మాటమీదే ఆధారపడాలని అబ్రాహాము గ్రహించి తననుండి దృష్టి మరల్చుకుని దేవుని మీద నమ్మకముంచాడు. వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అతడు విశ్వసించాడు. దేవుడు మనకు బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులేమీ లేకుండా ఉన్నప్పుడే మనం ఆయన మాటను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు.
తన మాట నిజమనీ
ఆయన నిరూపించాలని
నమ్మబోయే ముందు
కంటికి కనిపించాలని
అనలేదు నేను
ఆయన అన్న మాట చాలు
సత్యవాక్ శీలుడైన
ఆయన మాట పైనే
నిలిచి ఉన్నాను