Day 245 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను (ఫిలిప్పీ 1:30).

దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది. అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే. రిచర్డ్ బాక్సటర్ అనే భక్తుడంటాడు, "దేవా, ఈ ఏభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణకోసం నీకు వందనాలు" బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు.

అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు. కఠినమైన పాఠాలకు భయపడకూడదు. బుద్దిచెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు. వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరీ ఎక్కువ శోభాయమానంగానూ, మన పరలోకం మరింత మహిమాన్వితంగానూ ఉంటుంది.

ప్రశస్థమైన పింగాణి పాత్రలను మూడుసార్లు కాలుస్తారు. కొన్నిటిని ఇంకా ఎక్కువసార్లు కాలుస్తారు. ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు ధరించాలి? ఒకటి లేక రెండుసార్లు కాలిస్తే చాలదా? అవును, మూడుసార్లు కాలిస్తేనే గాని వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు. ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి.

మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ననుసరించే మనం రూపుదిద్దుకుంటున్నాం. మన శ్రమలు మనలో ఒకటి, రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు రగులుతున్నాయి. దేవుని కృపవల్ల,తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి.

ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పూయవు. పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యంవల్లనో చిన్నాభిన్నమై, దేవుని స్వస్థతాశక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు విచ్చిన భూమిపై జీవజలధారలు ప్రవహించి, పచ్చని నాచు నేలపై పరుచుకుని తుషార బిందువులు అక్కడ నాట్యంచేసి, రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి. ఆ దారిన వెళ్ళే చిన్న పిల్లలు ఆ పూలు కోసుకుంటారు.