Day 246 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

దోనే నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి . . . (మార్కు 6:48).

దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు హూనం చేసుకున్నందువల్ల జరగదు. తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా, కష్టం లేకుండా పూర్తి చేస్తాడు. వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ను మనద్వారా పని చెయ్యనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్తులం కావడమన్నమాట. విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి.

ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు ఇలా అన్నాడు "యేసు చెంతకు వచ్చాను. కడుపునిండా నీరు త్రాగాను, నాకు మరెన్నడూ దాహం వెయ్యదు. నేనెప్పుడూ ఆయాసం వచ్చేంతగా పనిచెయ్యను గాని పొంగి పొర్లేటంత నిండుగా ఉన్నాను. నా జీవితంలో ఇది గొప్ప వింత"

పొర్లిపారడానికి మనం కష్టపడనక్కర్లేదు. ఈ రోజూ రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకీ, ఫలవంతమైన జీవితంలోకీ మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు.

హృదయమా, విశ్రాంతిగా ఉండు
నీ దేవుని రహస్యమిదే
అస్తమానమూ పనిచెయ్యడమే
కాదాయనను సేవించడము
ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ
శ్రమలేక ఉన్నవారే నిజమైన సేవకులు

చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో
అలజడి రేపి కలతలు తెస్తాయి
ఆకాశపు మహిమల ఛాయ
అలల వల్ల చెల్లాచెదురవుతుంది
నీలో ఆయన ప్రతిబింబం
కనబడకుండా పోతుంది

దేవుడెవరు, ఎక్కడ అని అడుగుతారు
నిశ్చలుడైన దేవుని తరపున
నీ నిబ్బరమే వారికి జవాబు
నీ చుట్టూరా నిన్ను కదిలించే
సంఘటనలకి ఒకటే నీ సమాధానం

క్రీస్తులోనే నాకు విశ్రాంతి
హృదయమంతా నిండే శాంతి

పునరుత్థానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుత్థాన శక్తి ఉంది.