Day 253 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును (కీర్తనలు 138:8).

శ్రమలు పడడంలో దైవసంబంధమైన ఠీవి, వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు అందదు. మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళడం సాధ్యంకాదు. వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికీ చలించని పరిణతి నొందినప్పుడు తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమనం వచ్చినప్పుడు, బాధలనుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించడం కూడా అనవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు, బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట. సహనం మనలో ఈడేరిందన్నమాట. సిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట.

శ్రమలపట్ల ఇలాటి దృష్టి మనకు కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడం మొదలుపెడతాడు. ఇలాటి స్థితిలో మన వ్యక్తిత్వమంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. మనస్సుకీ, దేహానికి సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి. మనసులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది. నాలుక మౌనంగా ఉంటుంది. అది దేవుణ్ణి ప్రశ్నలు అడగడం మానుకుంటుంది. "దేవా నన్నెందుకు వదిలేశావు?" అని కేకలు వెయ్యదు.

మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది. పనికిమాలిన తలంపులను విసర్జిస్తుంది. జ్ఞానం సాధువౌతుంది. కోరికలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప వేరే కోరికలేమీ మనకు ఉండవు. అన్ని విషయ వాంఛలూ నశిస్తాయి. మనస్సును ఏదీ కదిలించలేదు. ఏదీ గాయపరచలేదు. ఏదీ అడ్డగించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాటివైనా మనస్సు దేవుణ్ణి కోరుకుంటుంది. దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు కాబట్టి మంచివేగాని, చెడ్డవేగాని, గడిచినవేగాని, రానున్నవేగాని, అన్నీ మన మంచికోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి.

పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు. మన బలాన్నీ, జ్ఞానాన్నీ, మన సంకల్పాలనూ కోరికలనూ విడిచిపెట్టి మనలోని అణువణువు యేసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలిలయ సముద్రంలాగా అయిపోవడం ధన్యకరం.

శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం.