కెరీతు వాగుదగ్గర దాగియుండుము (1 రాజులు 17:3).
దాగియున్న జీవితంలోని శ్రేష్ఠత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని యెదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి. "నా కుమారుడా, ఈ హడావుడీ, ఈ కీర్తీ, ఉత్సాహాలూ ప్రస్తుతానికి చాలు. నీవు వెళ్ళి వాగు దగ్గర దాగి ఉండు. వ్యాధి అనే కెరీతు వాగు దగ్గర, ఎడబాటు అనే కెరీతు వాగు దగ్గర, లేక ఎక్కడో మనుష్య సంచారం లేని ఏకాంతంలో కొంతకాలం గడుపు" అని మన తండ్రి సెలవిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు.
"నీ చిత్తమే నాకు శిరోధార్యం. నీలోనే నేను దాగి ఉంటాను. నీ సన్నిధి గుడారంలో నన్ను దాచిపెట్టు. నీ రెక్కల చాటున నాకు ఆశ్రయం కల్పించు" అని జవాబివ్వగలిగినవాళ్ళు ధన్యులు.
మనుషుల మధ్య గొప్ప విజయాలు సాధించిన పరిశుద్దులంతా ఏదో ఒక కెరీతు దగ్గర దాక్కున్నవాళ్ళే. మనం మనుషులనుండీ, మన స్వంత ఆశలనుండి దూరంగా తొలగిపోయి ఒక మూలన దాక్కొనకపోతే ఆత్మ శక్తిని పొందడం అసాధ్యం. నిత్య దేవుని ప్రభావాన్ని నింపుకోవడం అసాధ్యం. చెట్లు ఎన్నో సంవత్సరాలు సూర్యకాంతిని తమలో నీలుపుకొని బొగ్గుగా మారినప్పుడు మండడం ద్వారా ఆ వేడినంతటినీ బయటికి ఇస్తాయి. ఇలాగే క్రైస్తవులూ ఉండాలి.
బిషప్ ఆండ్రూస్ గారికి ఒక కెరీతు ఉంది. అక్కడ ప్రతిరోజూ దాదాపు 5 గంటలు ప్రార్థనలో, ధ్యానంలో ఆయన గడిపేవాడు. డేవిడ్ బ్రెయినార్డుకి ఉత్తర అమెరికా అరణ్యాలలో కెరీతు అనుభవం ఉంది. క్రిస్మస్ ఇవాన్స్ అనే భక్తుడికి వేల్స్ ప్రాంతంలోని కొండలలో ఈ అనుభవం ఉంది.
ఈ శకారంభానికి వెళ్లే పత్మసులో, రోమా చెరసాలలో, అరేబియా ఎడారిలో, పాలస్తీనా దేశపు కొండ ప్రాంతాల్లో ఎందరెందరో మహానుభావులకి ఎన్నెన్నో కెరీతులు ఉన్నాయి.
మన ప్రభువు నజరేతులో తన కెరీతులు కనుగొన్నాడు. యూదయ అరణ్య ప్రాంతాల్లో, బేతనీ ఒలీవ తోటల్లో,గదరా అరణ్యాల్లో ఆయన ఒంటరిగా ఉన్నాడు. కెరీతు దగ్గర దాక్కోకుండా మనం ఎవ్వరమూ క్రైస్తవ అనుభవంలోనికి రాలేం. ఎందుకంటే అక్కడ మాత్రమే మానవస్వరాలకు బదులు జల ప్రవాహపు ధ్వని మసకు వినిపిస్తుంది. అక్కడ నెమ్మది అనే నీటిని త్రాగుతాం. ఆకాశం నుండి ఆహారం దొరుకుతుంది. క్రీస్తులో దాగి ఉన్నప్పుడు చేకూరే మధురాద్భుత శక్తి అక్కడ మనది అవుతుంది.