Day 263 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను (యోహాను 11:40).

తమ ప్రభువు ఏమి చేస్తున్నాడో మరియ, మార్తలకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ అన్నారు "ప్రభువా, నువ్వు ముందుగా ఇక్కడికి వచ్చినట్టయితే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాడు." ఈ మాటల వెనుక వాళ్ళ అభిప్రాయం మనకు తేటతెల్లమౌతుంది. "ప్రభూ, ఇంత ఆలస్యం చేశావెందుకు? నువ్వు ప్రేమించిన వాళ్ళను మృత్యువు కబళిస్తుంటే నిర్లక్ష్యంగా ఎలా ఉండగలిగావు? నువ్వు మాతో ఉన్నట్టయితే మేము సుఖంగా ఉండేవాళ్ళం కాని నీవు ఇక్కడకి రావడం ఎందుకు ఆలస్యం చేసి ఈ విధంగా విచారం, నాశనం మమ్మల్ని అల్లకల్లోలం చేయనిచ్చావ్? సమయానికి ఎందుకు రాలేదు? ఇంక ఇప్పుడు పరిస్థితి చెయ్యి దాటిపోయింది. మా తమ్ముడు చనిపోయి నాలుగు రోజులైపోయింది"

దీనంతటికీ సమాధానంగా యేసు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. నీకు అర్థం కాకపోవచ్చు గానీ "నువ్వు గనక నమ్మితే నీ కళ్ళారా దాన్ని చూస్తావు"

తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు ఎందుకు అడిగాడో అబ్రాహాముకు అర్థం కాలేదు. కాని అతనికి నమ్మకం ఉంది. దాన్ని నిర్వర్తించి, దేవుని మహిమనూ, తన కుమారుడు తిరిగి తనకు దక్కడాన్నీ కళ్ళారా చూశాడు. దేవుడు తనను అరణ్యంలో 40 సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మోషేకు అర్థం కాలేదు. కానీ అతనికి నమ్మకం ఉంది. దేవుడు తనను ఇశ్రాయేలీయుల బానిసత్వపు చెరను విడిపించడానికి పిలిచినప్పుడు అతడు చూసీ గ్రహించాడు.

యోసేపుకు అర్థం కాలేదు తన సోదరుల క్రౌర్యం, కాముకురాలైన ఒక స్త్రీ మోపిన నేరం, అన్యాయపు కారాగారవాసం. వీటన్నిటినీ భరిస్తూ తన నమ్మకాన్ని నిలుపుకున్నాడు. వీటన్నిటి ద్వారా సమకూడిన దైవచిత్తాన్నీ, మహిమనూ అతడు కనుగొన్నాడు.

యాకోబుకు తన ముద్దుల కుమారుడైన యోసేపును దేవుడు తననుండి ఎందుకు దూరం చేశాడో అర్థం కాలేదు. కాని ఆ కుమారుడే ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధాన మంత్రి అయి, కరువులో తననూ, తన జాతినీ ఆదుకున్నప్పుడు దేవుని మహిమను కళ్ళారా చూశాడు.

నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాగే అర్థంకాక కొట్టుమిట్టాడుతున్నావేమో. "నాకిష్టమైనవాటిని నానుండి దేవుడు ఎందుకు దూరం చేశాడు? బాధలు నన్నెందుకు తరుముతున్నాయి? దేవుడు నన్ను ఈ వంకర దారులగుండా ఎందుకు నడిపిస్తున్నాడు? నా దృష్టికి మేలైనదిగా కనబడే నా పథకాలన్నీ విఫలమైపోవడం ఎందుకో అర్థం కావడంలేదు. నాకు అత్యవసరమైన ఆశీర్వాదాలు దయచెయ్యడానికి దేవుడింత ఆలస్యం చేస్తున్నాడేమిటి?" అనుకుంటున్నావేమో. స్నేహితుడా, నీ జీవితంలో దేవుడు చేస్తున్న వాటినన్నింటినీ నువ్వు అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. నువ్వర్థం చేసుకోవాలని దేవుడు అనుకోడు. నీ చిన్న కుమారుడు నువ్వు చేసే పనులన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడా? అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు. ఒకరోజున నీకు అంతుబట్టని ఈ విషయాల్లో దేవుని మహిమను చూస్తావు.

జీవిత ద్వారాలు తెరిచి దైవజ్ఞానాన్ని తరచి
సందేహాలు మరచి వెదికితే అవగతమౌతుంది

ఈ రోజు కాదు తొట్రుపడకు హృదయమా
దైవసంకల్పం అడవి పూలవలె వికసిస్తుంది
రేకలను బలిమిని విడదీయకు
విరిసిన రోజున చూడు వికసించిన అందాన్ని

ఓపికతో శ్రమపడితే చేరగలం గమ్యం
అలసిన పాదాలకు విశ్రాంతి దొరికేను
దైవఙ్ఞానపు తీరు అవగతమయ్యేను
సమస్తము తెలిసినవాడు ఆ దేవుడేను