సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని (లూకా 22:31,32).
దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురి చూసి కొట్టేది మన విశ్వాసాన్నే. మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చుగాని విశ్వాసం మాత్రం అలా తప్పించుకోలేదు. విశ్వాసాన్ని దాని మూలుగుదాకా పరీక్షించడానికి దానిలోకి పదునైన బాణాన్ని గుచ్చడంకన్నా వేరే మార్గం లేదు. ఇందువల్ల ఆ విశ్వాసం శాశ్వతమైనదా, కాదా అన్నది తెలుస్తుంది. దానికున్న ఆనంద కవచాన్ని లాగేసి, ప్రభువు పంపించే శ్రమలను దానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి. ఈ దాడులనుండి ఏ మాత్రం గాయపడకుండా బయటపడేదే నిజమైన విశ్వాసం. విశ్వాసం పరీక్షించబడాలి. అది దిక్కులేనిదైపోవాలి. కొలిమిలో అనేకసార్లు కాలాలి. ఈ పరీక్షలనన్నింటినీ తట్టుకుని నిలబడిన విశ్వాసంగలవాడు ధన్యుడు.
పౌలు అన్నాడు "నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను" కాని తన తలను పోగొట్టుకున్నాడు. అతని తలను నరికివేశారు గాని అతని విశ్వాసాన్ని మాత్రం తాకనైనా తాకలేకపోయారు. అన్యజనులకు అపొస్తలుడైన ఇతడు మూడు విషయాలలో సంతోషించాడు -మంచి పోరాటాన్ని పోరాడాడు", "పరుగును కడముట్టించాడు" "విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు" ఫలితమేమిటీ? పౌలు పందెంలో గెలిచాడు. బహుమతి పొందాడు. ప్రపంచం అతణ్ణి గొప్పవాడిగా ఎంచింది. అంతేకాదు, పరలోకంలో ఇతడు ఘనుడయ్యాడు. క్రీస్తులో విజయం సాధించడానికి అన్నిటినీ పోగొట్టుకున్నా అది లాభమే. ఈ దృష్టితో మనం ఎందుకు ప్రవర్తించం? పౌలులాగా సత్యానికి మనం ఎందుకు విధేయులం కాము? ఎందుకంటే పౌలు పాటించిన విధానం మనకు లేదు. మన లెక్కకూ అతని లెక్కకూ తేడా ఉంది. పౌలు నష్టం అని ఎంచిన వాటిని మనం లాభంగా లెక్కిస్తున్నాము. పౌలుకున్న విశ్వాసం మనకూ ఉండాలి. అతనికి దొరికిన కిరీటం మనకూ దొరకాలంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి.