ప్రాయశ్చిత్తము నాకు దొరికెను (యోబు 33:24).
ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సె ఉండడమే. మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండడమే. మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించడం; పునరుత్థాన శరీరంలాగా రూపాంతరం పొందడం. ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణంనుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకుని మహిమలో తండ్రి కుడి పార్శ్వాన ఆశీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత.
సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో, శక్తి అంతటిలో మనవాడయ్యాడు. మనం ఆయన శరీరంలోని అవయవాలం. ఆయన శరీరపు మాంసం, ఎముకలు మనమే. మనం నమ్మి స్వంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదౌతుంది. "దేవా, నా శరీరం నా ప్రభువుకోసం అనీ, నా ప్రభువే నా శరీరమని తెలుసుకొనేలా సహాయం చెయ్యి"
"నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు" (జెఫన్యా 3:17). "దాదాపు పాతికేళ్ళ క్రితం ఒక సందర్భంలో నా మనస్సు పూర్తిగా అలసిపోయి పనిచెయ్యలేని స్థితికి వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థత గురించిన సత్యాన్ని నాకు స్పురింపజేసింది. తెరిచిన నా హృదయపు వాకిలిగుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణమూ దానిని శక్తితో నింపి జీవం పోసి తన వ్యక్తిత్వపు సన్నిధితో, శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు. అటుపైన దేవుడు నావాడే. ఆయన్ను ఎంతమట్టుకు నాలో ఇముడ్చుకోగలనో అదంతా నా సొత్తే. ఈ మహా శక్తివంతుడైనవాడే మనలో నివసించే దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్దాత్మగా ఆయన గ్రహాలకు సూర్యుడేలా కేంద్రస్థానమో, అలాగే నాకు కేంద్రబిందువై నా మనస్సులో గొప్ప శక్తికారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకుని కూర్చున్నాడు. నా శిరసు మధ్యలో ఆయన ఉన్నాడు."
ఇది ఇరవై సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం. ఈ సత్యం ఇంకా ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా 70వ యేట నేను ఇంకా 30 సంవత్సరాల యువకునిలా హుషారుగా ఉండగలిగేలా చేసింది. ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే. నేను గతంలో చెయ్యగలిగినదానికన్నా మానసికంగానూ, శారీరకంగానూ రెండింతలు పనిచేస్తున్నాను. నా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఊటబావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అన్నిరకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ, రాత్రింబవళ్ళు బోధిస్తూ, పని చెయ్యగలుగుతున్నాను. - (జార్జి ముల్లర్)
శరీరం ఆత్మ విముక్తి నొందాయి
ఓ దేవా, పవిత్రుడనై నీకర్పిస్తాను
ఇకముందెన్నటికి కృతజ్ఞతార్పణ
నా శాయశక్తులూ సంపూర్ణంగా
నీ మహిమలో ఐక్యమౌతాయి గాక