యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగాఆశీర్వదించెను (యోబు 42:12).
తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్నీ తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్నిపరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి, ఇంతకుముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగడానికే కదా సంభవించాయి. కారుచీకటివల్ల, కన్నీళ్ళవల్ల, మరణంవల్ల, నేను మహిమను సంతరించుకున్నాను. నా మధురఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పండింది. యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను, దేవునిపై ఇంతకు ముందెన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి. "ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది" అంటున్నాడు.
నొప్పివలన, నష్టంవలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి "నీ చిత్తం జరుగును గాక" అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే. దేవుడు యోబుకి తన భవిష్యత్కాలపు మహిమ దృశ్యాలు చూపించాడు. ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకుని "నా విమోచకుడు సజీవుడు" అంటూ సాక్ష్యమివ్వగలిగాడు. నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితికంటే దీవెనకరమైనది.
బాధ తనతోబాటు ఎప్పుడూ ఒక మేలును తీసుకువస్తుంది.
బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తరువాత అర్థమౌతుంది. ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు, నిర్భయంగా, నిరాటంకంగా విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలాకాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది. వేదనద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు. ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు. అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు.
శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి. ఆత్మలో బలిష్ఠులైన వాళ్ళకు బోలెడన్ని గాయపు మచ్చలుంటాయి. హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి. దుఃఖపడేవారు తమ కన్నీళ్ళగుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు.
నీ గళసీమపై తళతళ మెరిసే
పసిడిహారాన్ని చూసి గ్రహించాను
ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్నీ
నువ్వు భరించిన అన్ని బాధలనీ
ధీర హృదయమా వర్థిల్లు
ధగధగ మెరుస్తూ ప్రకాశించు
నువ్వనుభవించిన శ్రమలకోసం
కృతజ్ఞతతో ఉండు.