కొంతకాలమైన తరువాత ... ఆ నీరు ఎండిపోయెను (1 రాజులు 17:7).
నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేననీ, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేననీ మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలీయాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది. "కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను" ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనమిదే.
వరాల మీద ఆశ పెట్టుకోవడానికీ, వరాలనిచ్చే వానిమీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు గాని వర ప్రదాతది శాశ్వత ప్రేమ.
ఏలీయాకు సారెపలు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తరువాత అంతా స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్ళు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే.
ఏలీయాను దేవుడు నేరుగా సారెపతుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను, జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాసమూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ, భూమ్యాకాశాలను సృష్టించిన దేవుని పైనే.
ఇలాటి సెలయేటి గట్టునే కాపురమున్నావేమో నువ్వూను
దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో
కాలం గడిచేకొద్దీ అది ఎండిపోతూ ఉందేమో
నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు
నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు
కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో
నిన్నలరించిన సెలయేరు ఎండిపోతే
నీ దాహానికది నీళ్ళివ్వలేకపోతే
ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే
దేవుడే నీకు సేదదీరుస్తాడు
నిన్ను వదలడు సిగ్గుపడనియ్యడు
ఆనందతైలంతో అభిషేకించి కన్నీళ్ళు తుడుస్తాడు.