నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదను (ఆది 33: 14).
మందల గురించి, పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ! ఎంత ఆపేక్ష! వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు! ఒక్క రోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పడంలేదు. బలవంతుడైన ఏశావు వెళ్లినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్లగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవొ అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్నిబట్టె అతడు నిర్ణయించాడు. అదే అరణ్యప్రదేశంలో కొన్ని సంవత్సరాల క్రితం అతను ప్రయాణించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలోని కష్టసుఖాలు, దూరాభారాలు అతనికి తెలుసు. అందుకే "నేను మెల్లగా నడిపించుకొని వస్తాను" అంటున్నాడు. "మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు."
అంతకుముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు. కానీ మన ప్రభువైన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు. కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్లు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలె కోసురాళ్లు, నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారిలు, దారికడ్డంగా సడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నిటిని మీదుగా యేసుప్రభువు ఇంతకుముందు నడిచాడు. ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమలవల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు. మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది. నీ పాదం వేయగల అడుగులకంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన. తరువాత అడుగు చెయ్యగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యీ. ఆయనకి తెలుసు. ఆ అడుగు వేయడానికి బలాన్నివ్వాలా, లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా? - ఆయనకే తెలుసు.
లేబచ్చిక మైదానాల్లో
నా ప్రభువు నడిపిస్తాడు
పచ్చదనం కోల్పోయీన తావుల్లో
కరుణ కవోష్ణ దృక్కులతో నడిపిస్తాడు