వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. (లూకా 18:1)
"చీమ దగ్గరికి వెళ్ళండి" తామర్లేన్ ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు. "ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుపడిన భవనంలో తలదాచుకున్నాను. అక్కడ కూర్చుని చాలా గంటలు గడిపాను. నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను. ఆ గింజ అరవై తొమ్మిదిసార్లు పడిపోయింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. డెబ్భైయవసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ". ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్నిచ్చింది. ఆ పాఠాన్ని నేనెప్పుడూ మరచిపోను."
గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత, సోమరితనంగా యధాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటినుండి చివరిదాకా మనం యేసుప్రభువు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన, నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన, చేసినకొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్ధన - ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది.
సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు. "సంగీత సాధనను నేను ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది. మూడురోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరికి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది." మనం నమ్మకంలోను, ప్రార్థనలోను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోను ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేసాడనుకోండి, ఏమవుతుందో మనకి తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనమూ సర్వశ్రేష్టతని సంతరించుకోగలం.
డేవిడ్ లివింగ్ స్టన్ ఆశయం ఇది. "నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్నదాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం." తడబాటులేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు.