Day 305 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆ మేఘము . . . నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ... ప్రయాణము చేయకుండిరి (సంఖ్యా 9:19).

ఇది విధేయతకు తుది పరీక్ష గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది. సిల్కు పొరలవంటి మేఘ సన్నిధి గుడారం పైనుండి అలవోకగా, ఠీవిగా తేలిపోతూ ముందుకు సాగితే దానివెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. దారి వెంటపోతూ ఉంటే కనబడే ప్రకృతి సౌందర్యం, కొత్త ప్రదేశాలను చూడడం, తరువాతి మజిలీ ఎక్కడో అనే ఉత్సుకత.. ఇదంతా ఎంతో బాగుంటుంది. కాని ఉన్నచోటే ఆగిపోవడం అన్నదే బహు కష్టం.

ఆ ఉన్న ప్రదేశం గాలీ గంతా లేకుండా ఉన్నా, సదుపాయాలేమీ లేకుండా ఉన్నా, ఒంటికి ఎంత సరిపడకున్నా అది మన సహనాన్ని ఎంత పరీక్షించినా, ప్రమాదానికి ఎంత చేరువైనా అక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు.

కీర్తనకారుడు ఇలా అంటాడు. "ప్రభువు కొరకు ఓపికతో కనిపెడుతున్నాను, ఆయన నా మొరను చెవినిచ్చి ఆలకించాడు" అప్పటి పాత నిబంధన పరిశుద్దుల కోసం చేసిన పనులను అన్ని కాలాల్లోనూ చేయగలడు.

కాని దేవుడు మనలను కొంతకాలం ఎదురుచూస్తూ ఉండనిస్తాడు. హడలగొట్టే శత్రువులకు ముఖాముఖిగా, కంగారు పెట్టే పరిస్థితుల్లో ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనలను అక్కడే ఉండమంటాడు. అయితే మనం వెళ్ళిపోవాలి. గుడారాలను ఎత్తివేయాలి. ఇప్పటికే సర్వనాశనం అయిపోయేంతలా బాధలుపడి ఉన్నాం. ఈ వడగాలిని, మంటలను విడిచిపెట్టి పచ్చిక బయళ్ళనూ, నదీజలాలను వెదుక్కుంటూ వెళ్ళవలసిన సమయం వచ్చింది గదా.

దేవుని దగ్గరనుంచి ఏ ఉలుకూ పలుకూ లేదు. మేఘం కదలడంలేదు. మనం కదలడానికి వీలులేదు. అయితే మన్నా, రాతిలోనుండి నీళ్ళు, ఆశ్రయం, రక్షణ మనతో ఉన్నాయి. దేవుడు తన సన్నిధిని మనతో ఉంచకుండా, మన అనుదిన అవసరాలను తీర్చకుండా ఎక్కడా మనల్ని ఆగిపొమ్మని చెప్పడు.

యువకుల్లారా, తొందరపడి మార్పుకోసం పరుగెత్తకండి. దైవ సేవకుల్లారా, మీరున్న చోటే నిలిచి ఉండండి. మేఘం కదిలేదాకా మీరు కదలడానికి వీల్లేదు. ఆయన తనకు ఇష్టమైనప్పుడు మీకు అనుమతి ఇస్తాడు.

చతికిలబడి ఉన్నాను
లేచి పరుగెత్తాలని కంగారు
కోరుకున్న చోటు వేరే ఉంది
అయితే అంతకన్నా
ఆయనపై ఆధారపడాలని ఉంది.

నా కుమారీ కదలకు
అన్యులు నశిస్తున్నారు
నేనేమీ చేయలేకున్నాను
వాళ్ళని చేరాలనుంది
కాని దేవునిపై ఆధారపడాల్సి ఉంది.

పొందడం మంచిది
ఇవ్వడం మరీ మంచిది
అయితే అడుగడుక్కి
క్షణక్షణానికి అన్ని వేళల్లో
దేవునికి లోబడిపోవడం
అన్నిటికంటే ఉత్తమం.