నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.. అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను (యెహెజ్కేలు 1:1,3).
మనకు దేవుని వాక్యాన్ని చెరసాల వివరించినంత స్పష్టంగా మరేదీ వివరించలేదు. మనం బబులోను నదుల ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు మన దైవ సంకీర్తనలు మన హృదయాలను కదిలించినట్టుగా మరెన్నడూ కదిలించలేదు. మనం చెరలో పాడిన పాటలు ఆనందంతో మారుమ్రోగుతాయి.
జీవితంలో కష్టాలను అనుభవించిన వ్యక్తి తన దైవగ్రంథాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు. మరొక బైబిలుకి అతని బైబిలుకీ చూడడానికి తేడా ఏమీ కనిపించకపోవచ్చు. అయితే అతనికి అలా కాదు. ఆ పాతగిలిపోయిన కన్నీళ్ళ మరకలతో నిండిన బైబిలు నిండా ఇతరులెవరికీ కనిపించని అక్షరాలతో అతడు తన అనుభవాలను రాసుకున్నాడు. అతనెప్పుడూ అతని జీవితపు బేతేలు స్థంభం దగ్గరకీ లేక ఎలీము చెట్ల దగ్గరకీ వస్తుంటాడు. అతని జీవిత చరిత్రలో అవి మలుపురాళ్ళు.
మన చెరనుబట్టి మనకు కూడా ఆశీర్వాదం రావాలంటే ఆ పరిస్థితిని మనకు అనుకూలమైనదిగా మార్చుకోవాలి. మన దగ్గరనుండి దేన్నయినా దేవుడు లాగేసుకుంటే, లేక దూరం చేస్తే దానిని గురించి చింతించడంవల్ల ఏమీ లాభం లేదు. మనకు మిగిలి ఉన్నవాటిని అభివృద్ధిపరచుకోనియ్యకుండా ఇది చేస్తుంది. లాగినకొద్దీ ఉరి బిగుసుకుంటుందే తప్ప వదులుకాదు.
దూకుడు స్వభావం ఉన్న గుర్రం తన కళ్ళెం ఆజ్ఞలను ఓపికగా అనుసరించకపోతే దానికే నొప్పికదా? కాడి కింద ఎద్దు అసహనంగా అటూ ఇటూ కదులుతుంటే దాని మెడమీదే పుండ్లు లేస్తాయి. పంజరం కమ్మీలకేసి "నన్నొదిలేయండి, నన్నొదిలేయండి"అంటూ రెక్కలు టపాటపా కొట్టుకోవడం కంటే పంజరంలో ప్రశాంతంగా కూర్చుని బయట స్వేచ్ఛగా ఎగిరే కోయిలకంటే తియ్యగా పాటలు పాడడం చిలకమ్మకు మేలు కదా.
ఏ ఆపదా మనకు చెడు చెయ్యలేదు. దాన్ని మనం తీవ్రమైన ప్రార్ధనలో దేవుని ముందు ఉంచగలిగితే వర్షం నుంచి తప్పించుకుందామని చెట్టుని ఆశ్రయించిన వాడికి తాను వెతుకుతున్న పండు ఆ చెట్టు కొమ్మల్లోనే కనిపించవచ్చు. దేవుని రెక్కల క్రిందికి ఆశ్రయంకోసం పరుగెత్తిన మనకు ఇంతకు ముందెన్నడూ దేవునిలో కనిపించని, తెలియని దీవెనలు కనిపిస్తాయి.
ఈ విధంగా దేవుడు తనను తాను మన శ్రమల్లో, బాధల్లోనే కనబరచుకుంటాడు. యబ్బోకు రేవు దాటితే పెనూయేలు చేరతాము. అక్కడ మన పెనుగులాట మూలంగా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాము. ఆ విధంగా మన ప్రాణాలు దక్కించుకుంటాము. "చెరలో ఉన్నవాళ్ళలారా, దేవుడు మీకు రాత్రిలో ఆనందగానాన్ని ఇస్తాడు. నీకోసం మరణచ్ఛాయను అరుణోదయంగా మార్తేస్తాడు"
దేవుని చిత్తానికి లోబడడం అనేది తలవాల్చుకోవడానికి అత్యంత క్షేమకరమైన తలగడ.
అదృశ్యమైన మహిమ
నా గదిలో నిండింది
నా బ్రతుకులో నిండింది
పెనుగులాటల్లో ప్రశాంతత నిచ్చింది
వాగ్దాన విహంగమతి
పాటలు పాడింది.