యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా? (ఆది 18:14).
ఇది నీకూ, నాకూ ఈ రోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. మన హృదయంలో ఉన్న ప్రియమైన అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నయినా తలుచుకోమంటున్నాడు. అది మన కోసం గానీ, మనకు అయినవాళ్ళకోసం గాని మనం మనసారా ఆశించింది. ఎంతోకాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాన్ని గురించి నిరాశ పడిపోయి ఆ విషయం ఇంక ఆలోచించడం మానేసామేమో. గతంలో అయితే అది జరిగి ఉండదేమో. ఇక జరిగే ఆశ లేదనుకుని, ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకుని వదిలేసిన కోరికేమో అది.
అదే, ఆ విషయమే, మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే (అబ్రాహాము శారాలకు సంతానంలాగా) అది ఎంత అసంభవం అయినప్పటికీ, అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని దేవుడు మనపట్ల అక్షరాలా జరిగించనున్నాడు - మనం ఆయన్ను జరిగించనిస్తే.
దేవునికి అసాధ్యమైనదేదైనా ఉన్నదా? అవును, మనం ఆయనలో విశ్వాసముంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చెయ్యడానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. అబ్రాహాము, శారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్టయితే దేవుని తలంపు వారిపట్ల నెరవేరేది కాదు.
యెహోవాకు కష్టమనిపించేది ఒకటే. ఆయన ప్రేమనూ, శక్తినీ మనం అదే పనిగా శంకిస్తూ, మనపట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండడమే. తనమీద విశ్వాసం ఉన్నవాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు.