Day 322 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు (లూకా 7:23).

క్రీస్తు విషయం అభ్యంతరపడకుండా ఉండడం ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతూ ఉంటుంది. సమయానుసారంగా అభ్యంతరాలు కలుగుతుంటాయి. నేను జైలులో పడతాననుకోండి, లేక ఇరుకులో చిక్కుకుంటాననుకోండి. ఎన్నెన్నో అవకాశాల కోసం ఎదురుచూసే నేను వ్యాధితో మంచం పట్టాననుకోండి, అపనిందల పాలౌతాననుకోండి. అభ్యంతరపడకుండా నిగ్రహించుకోవడమెలా? అయితే నాకేది మంచిదో దేవునికి తెలుసు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన నిర్దేశించినవే. నా విశ్వాసాన్ని పెంపొందించడానికి తనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడానికీ, నా శక్తిని సంపూర్ణం చెయ్యడానికి ఆయన వాటిని సంకల్పించాడు. చీకటి కొట్టులో నా ఆత్మ మాత్రం మొగ్గ తొడుగుతూ ఉంటుంది.

అభ్యంతరాలు మానసికమైనవి కావచ్చు. నా మనస్సును సమస్యలు, జవాబు దొరకని ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఆయనకు నన్ను నేను సమర్పించుకొన్నప్పుడు నాకు ఇంకేమీ బాధలుండవనుకున్నాను. అయితే మాటిమాటికీ కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. కాబట్టి కష్టాలు కొనసాగుతూ ఉన్నట్టయితే ఇంకా ఇంకా ఖచ్చితంగా ఆయనలో నేను నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నేను చేసే ఇలాటి ప్రయత్నాలవల్ల మిగిలిన బాధితులకు నేను మార్గదర్శిగా ఉండాలన్నమాట.

అభ్యంతరాలు ఆధ్యాత్మికమైనవి కావచ్చు. ఆయన మందలో చేరిన నాకు శోధన చలిగాలులు తగలవని ఆశించాను. అయితే శోధనలు ఎదురవడమే మంచిదని తెలుసుకున్నాను. ఎందుకంటే శోధనలతోబాటు ఆయన కృపకూడా అధికమౌతున్నది. నా వ్యక్తిత్వం ఈడేరుతున్నది. దినదినం పరలోకం నాకు చేరువౌతున్నది. అక్కడికి చేరి వెనక్కి తిరిగి నాకు ఎదురైన సమస్యలన్నిటినీ చూస్తాను. నాకు దారి చూపిన దేవుణ్ణి స్తుతిస్తాను. కాబట్టి వచ్చేవాటిని రానియ్యండి. ఆయన చిత్తాన్ని అడ్డగించవద్దు. ప్రేమగల ప్రభువు గురించి అభ్యంతరపడడం నాకు దూరమౌనుగాక.

అభ్యంతరపడనివాడు ధన్యుడు
అతని చుట్టూ దేవుని సన్నిధి
అతని చుట్టూ ఉన్నవారికి
విడుదల కలిగిస్తూ ఉంటుంది.

అతని శరీరం కారాగారంలో కృశించినా
తండ్రి ప్రేమను తలపోస్తూ
తృప్తిగా కాలం గడుపుతాను
అతని జీవనజ్యోతి ఆరేదాకా

పనిచేసే శక్తి ఉడిగిపోయి చాలా రోజులు
మూలనబడ్డవాళ్ళు ధన్యులు
ఇతరులకోసం ప్రార్థించడంవల్ల
శ్రమ ఫలితంలో భాగం పొందుతారు.

శ్రమలు పడే వాళ్ళు ధన్యులు
నీ శ్రమలకు కారణాలేమిటో
లేశమాత్రమైనా తెలియకపోయినా
ఆ దివ్యహస్తాలలో నీ జీవితాన్ని పెట్టు.

అవును, అభ్యంతర పడనివాళ్ళు ధన్యులు
వచ్చే ఆపదలు అర్థం కాకపోయినా
రహస్యాలు రహస్యాలుగానే మిగిలిపోయినా
గమ్యం చేరేదాకా అభ్యంతరపడనివాళ్ళు ధన్యులు.