నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి (కీర్తనలు 60:3).
"కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి" అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో పొరపాటేమీ లేదు. జీవితంలో కఠినమైన విషయాలెన్నో ఉన్నాయి. ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూలగుత్తి ఇచ్చారు. "ఎక్కడివి?" అని అడిగాను. "ఇవి రాళ్ళలో పూసిన పూలు. నేల ఏమీ లేని రాళ్ళ పైనే ఇవి వికసిస్తాయి" అని చెప్పారు. కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను. ఇలాటి రాతి పూలకోసం ఆయన హృదయంలో గులాబీల పై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను.
జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే గాని పడగొట్టడానికి కాదు. కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడుచేయవచ్చు గానీ అతని వ్యక్తిత్వాన్ని బాగుచేస్తాయి. బాహ్య పురుషుడి పాలిట కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశమిస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడడం ద్వారా, తిరుగుబాటు చేయడం ద్వారా మనం పోగొట్టుకొనేదే.
కొలిమిలో దగ్ధమై సమ్మెట దెబ్బలు
తిన్నవారే యోధులౌతారు
అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం
రక్తం తడిసిన నేలలోనే
పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం
శ్రమలకొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు.