బాణములను పట్టుకొమ్మనగా...నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి - నీవు అయిదు మారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు (2 రాజులు 13:18,19).
ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది! యెహోయాషు తాను చేయ్యవలసిన పనిని రెండవసారి మూడవసారికూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాసకార్యమే. అయితే దేవుడు, దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు.
అతనికి కొంత దొరికింది. చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి, ఆశీంచాడో అంతవరకు దొరికింది. కాని అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ,వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసిరాలేదు. మనుషులందరూ పొందగలిగేదానికంటే ఎక్కువే పొందాడు గాని, దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు.
మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం! ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది! చివరిదాకా ప్రార్థన చెయ్యడమనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతను, నమ్మికగల ప్రార్థనవల్ల లభించే అన్ని దీవెనలనూ స్వంతం చేసుకుందాం.
"మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి..." (ఎఫెసీ 3:20).
పౌలు వ్రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనబడవు. ప్రతి మాటలోను అనంతమైన ప్రేమ, ప్రార్థించే మనపట్ల గొప్ప కార్యాలు చెయ్యగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక్క షరతు - "మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున" మనం ఆయన్ను ఎంతవరకు చేయ్యనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి, తన రక్తంలో కడిగి, తన ఆత్మమూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి, అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో, అన్ని ఆపదల్లో పనిచేస్తుంది.