కాలేబు ఆమెను చూచి - నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె - నాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమీ యిచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను (యెహోషువ 15:18,19).
మెరక మడుగులు, పల్లపు మడుగులు కూడా ఉన్నాయి. అవి ఊటలు. నీళ్ళు నిలిచిన మడుగులు కాదు. ఎండ వేడిమిలో, శ్రమ, బాధలు నిండిన ఎడారిభూముల్లో పైనుండి కురిసే ఆనందాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్సాకి కాలేబు దక్షిణ భూముల నిచ్చాడు. దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది. కాని కొండల్లో నుంచి ఎండిపోని సెలయేళ్ళు వస్తున్నాయి. అవి దేశమంతటినీ చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి.
జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి. కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మనమెక్కడ ఉన్నా, ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు.
కనాను పర్వతాల్లో అబ్రాహాము వాటిని కనుగొన్నాడు. మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి. సిక్లగులో దావీదుకున్న సర్వస్వమూ నాశనమైనప్పుడు అతని కుటుంబాన్ని అంతటినీ శత్రువులు చెరగొనిపోయినప్పుడు, అతని అనుచరులు అతణ్ణి రాళ్ళతో కొట్టబోయినప్పుడు ఈ ఊటలు అతనికి కనిపించాయి. అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు.
చెట్లు ఎండిపోయినప్పుడు, పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కూకు ఈ ఊటలను కనుగొన్నాడు. వాటిలోనుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు "నా రక్షణ కర్తయైన దేవునియందు నేనానందించెదను."
సనైరీబు దాడి చేసిన కాలంలో యెషయాకి ఈ ఊటలు దొరికాయి. పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది. "దేవుని పట్టణమును తన ధారల వలన ఆనందభరితము చేయునది కలదు. దేవుడే దాని మధ్యనున్నాడు. అది కదిలించబడదు"
అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఊటల్ని చూశారు. సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఊటల్లోనిది తాగారు. మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే, సంవత్సరం పొడుగునా మనకు అవి అందుబాటులో ఉంటాయి. దావీదుతో కలసి చెబుదాం "నా జలధారన్నియు, దేవా నీలో ఉన్నవి."
ఈ ఊటలు ఎన్ని ఉన్నాయో! ఎంత ప్రశస్తమైనవో! దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది!
ఎడారి అంతులేకుండా ఉంది
ఎడారి బోసిగా ఉంది
దాహం తీర్చే ధారలెక్కడున్నాయి
తుపానుకి ఆశ్రయమెక్కడ ఉంది?
ఎడారి చాలా ఒంటరి ప్రదేశం
ఆదరించే మాటలు వినబడని దేశం
నా మనసుని ఆహ్లాదపర్చి
ఓదార్చేవారు కనబడని ప్రదేశం.
భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి
గలగలా వినబడింది
పచ్చనిచెట్లు, పాడే పక్షులు
ఆ ప్రాంతమంతా నిండాయి
మృదువుగా వినిపించిందో స్వరం
కంగారు పడ్డావెందుకు
రేపేం జరుగుతుందోనని దిగులెందుకు
తండ్రికి తెలియదా నీక్కావాల్సిన సర్వం?