ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు (కీర్తనలు 65:8).
ఉదయం పెందలాడే లేచి కొండమీదికి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుణ్ణి పైకి నెడుతున్నకొలదీ ఆకాశంలో బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. అన్ని రంగులూ కాస్త కాస్త అక్కడక్కడా ప్రత్యక్షమౌతాయి. అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమౌతుంది. దినకరుడు ఠీవిగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి.
సంజెకాంతుల కెంజాయలో
మంజుల స్వరమొకటి విన్నాను
"దినమంతా నీతో ఉన్నాను
సంతోషంగా ఉండు"
ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం ఆహతహలాడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శ్రుతి కలపడానికి నాకు తోడ్పడుతుంది. ఉషోదయవేళ విసిరే గాలి నా నాసికారంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోను, తన మనసుతోను, తన ఆత్మతోను నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా, అందులోనే నా బ్రతుకును నిలుపుకుని మహిమను పొందగలిగేలా, ప్రార్థించేలా చేసింది. దేవుడు ఇచ్చే ఉదయాలూ, రాత్రిళ్ళూ లేకపోతే మానవమాత్రులం, మనమెలా బ్రతకగలం!
రాత్రికి పగటికీ మధ్య
వేగుచుక్క పొడిచిన వేళ
నీడల జాడలు నిశ్శబ్దంగా
కదిలిపోతున్న వేళ
ఈ దినం చెయ్యవలసినదేమిటని
నీ గదిలో ఏకాంతంగా
ముచ్చటగా యేసుతో ముచ్చటించు
ఆయన చిత్తమేమిటని
నిన్ను నడిపిస్తాడు
పర్వతాలు వంచుతాడు
ఎడారులు పూలు పూస్తాయి
"మారా ధార" మధురమౌతుంది
ఈ జీవన యాత్రంతా
తెలుసా జైత్రయాత్రని
ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే
నిజమే ఇది ప్రతి నిత్యం.