మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును (హెబ్రీ 12:11).
జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది. ఒక రాజ వంశీయుడు తన భవనం గోడలమీద పెద్ద పెద్ద తీగెల్ని అమర్చాడట. స్వర తంతులమీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటుంది. కాని ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగెల్ని వాయిద్యానికున్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేదిగాని సంగీత ధ్వనులేవీ వినిపించేవి కావట.
ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుపాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగెలనుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుపాను అవసరమైంది.
మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా, సౌఖ్యంగా జీవించి నంతకాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు. అయితే తుపానులు వాళ్ళను వేధించినప్పుడు తమలోనుంచి బలంగా వినిపిస్తున్న సంగీతనాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు.
కిటికీకేసి టపటపా
కొడుతూ పడుతున్న వానజల్లు
కారు మబ్బుల్లోంచి వదలక
కురిసేదెందుకో అర్థం కాలేదు
పువ్వులు పువ్వులు
వర్షం వెలిసాక విరిసే పువ్వులు
నేలంతా పరుచుకునే పువ్వులు
దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో
మనం శ్రమలను సరియైన పద్దతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తరువాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ది చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తరువాతి కాలంలో ఫలితాలెలా ఉంటాయి?