Day 338 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను (మత్తయి 14:23).

ఇశ్రాయేలీయుల సబ్బాతులోని విశేషమేమంటే దాని ప్రశాంతత, విశ్రాంతి, దాని పరీశుద్ధమైన శాంతి. ఏకాంతములో అర్థంకానీ బలమేదో ఉంది. కాకులు గుంపులు గుంపులుగా ఎగురుగుతాయి. నక్కలు గుంపులు గుంపులుగల ఉంటాయి. కాని ప్రకాశం, సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి.

హడావుడిలో, శబ్దంలో శక్తి లేదు. నిమ్మళంగా ఉండడంలో బలముంది. సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దాన్లో ప్రతిబింబిస్తాయి. మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు. కానీ ఎన్నోసార్లు ఆయన వాళ్ళకి దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు. సాయంత్రమయ్యేసరికి జనసమూహాలనుండి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఆయన సేవంతా సముద్ర తీరప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది. కాని కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు. చాలాసార్లు రాత్రివేళల్లో ఆయన ఆ కొండల ప్రశాంతతలోకి వెళ్ళాడు.

ఈ రోజుల్లో ముఖ్యంగా మసకి కావలసిందేమిటంటే మన ప్రభువుతో ఏకాంతంగా వెళ్ళడం. ఆయన పాదాల చెంత, ఆయన సన్నిధిలో కూర్చోవడం. ధ్యానం అనే కళను అందరం మర్చిపోయాం. రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం. దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగడం మర్చిపోయాం.

సారవంతమైన లోయ మంచిదే
గోధుమ పొలాల్లో పనివాళ్ళక్కడ ఉంటారు
సూర్యాస్తమయందాగా పంట కోస్తుంటారు
కానీ దూరాన కన్పిస్తున్నాయి కొండలు
వచ్చే పోయే వాహనాల రొద అక్కడ లేదు
నన్ను పిలిచే ఒక స్వరం ఉంది
శిఖరాగ్రంనుండి ఏకాంతానికి పిలుస్తుంది
లోయలో ఉండడం బాగానే ఉంది
రోజంతా పనిచెయ్యడం బాగానే ఉంది
నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం
అర్రులు చాస్తూ ఉంది
కొండలపై తిరుగాడే దైవాత్మ కోసం
కొండలపై దొరికే ప్రశాంతత కోసం
నా గుండె తహతహలాడుతోంది.

ప్రతి జీవితంలోను దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి.