నీవు ఆయనను నమ్ముకొనుము (కీర్తన 37:5).
"నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాటిది." ఇది పాతనిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనేమాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయభాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందని భావించడం.
"నమ్మిక" లో ఇంతకంటే ఎక్కువ అర్ధమే ఉంది. దానికి దృష్టి ఉంది. అనుభూతులు ఉన్నాయి. ఇది ఒక మనిషి మీద సంపూర్ణంగా ఆధారపడుతుంది. ఇది ఉత్తమమైన ప్రేమ నిండిన హృదయం ఉంటేనే సాధ్యం. కాబట్టి ఆ దేవుని మీద ఇలాటి నమ్మిక ఉంచుదాం. "ఎన్ని ఆలస్యాలు అయినా, కష్టాలు వచ్చిపడినా, నిరాకరణలు ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలమైనా, మార్గం అర్థం కాకపోయినా, సంగతేమిటో తెలియకపోయినా" మార్గం సుగమం అవుతుంది. స్థితిగతులు సుఖాంతమౌతాయి. మబ్బు విడిపోతుంది. నిత్యప్రకాశం నెలకొంటుంది.
విశ్వాసానికి విషమ పరీక్షలెదురైతే
దేవునిలో నీ నమ్మిక ఉంచు.
శత్రుభయాన్ని కట్టి పెట్టు
నమ్మికతో, విశ్రాంతిగా ఆయన కోసం కనిపెట్టు.
గూట్లో కుదురుగా కూర్చున్న
గువ్వపిల్లలా హాయిగా ఉండు
ఆయన రెక్కలక్రింద నీ రెక్కలు ముడిచి
నమ్మకముంచి హాయిగా సేదదీర్చుకో.