తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు తన శక్తిగల మాటతో ఈ సర్వ సృష్టిని సృష్ఠించి, ఏకరీతిగా పరిపాలిస్తూ, మానవాళికి అవసరమైన సర్వ సంపదలను సృష్ఠించి వారిని పోషిస్తూ ఆదరిస్తున్న దేవునికి మానవుడు ఏ విధంగా కృతజ్ఞతను కానపర్చుకోవాలో వివరిస్తూ నిర్గమకాండం 23:16 లో “నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.”
ఈ పండుగలో పాల్గొనే ప్రతీ విశ్వాసికి దేవుని పట్ల తనకుగల విధేయతను, విశ్వాసాన్ని, ప్రేమను మరియు సమర్పణను ప్రదర్శించుకొనే గొప్ప భాగ్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. అందుకు దేవునికి స్తోత్రములు.
దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం.
ఇచ్చుట అనేది దైవ లక్షణం. సర్వమానవాళి రక్షణార్ధం దేవుడు తన ఏకైక కుమారుడగు క్రీస్తు యేసును పాప పరిహారార్ధబలిగా ఇచ్చి వేసియున్నాడు.. దేవుడు లోకమును ఏంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యెహో 3:16). దేవునికి గల ఈ లక్షణములను మనము కలిగియుండాలనేది ఆయన సంకల్పం.
దేవుని చేత సృష్ఠింపబడిన ఈ సృష్ఠిని నిశితంగా పరిశీలిస్తే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో అద్భుతమైన దేవుడో మనకు అర్ధం అవుతుంది. ఈ ప్రకృతిలో ప్రతిదీ మన కిచ్చుటకే సృష్ఠింపబడినదనేది మనకు తెలియుచున్నది. దేవుని నడిపింపు వలన ప్రకృతి ద్వారా పుచ్చుకుంటున్న మనం “ఇచ్చుట” అనే భాధ్యతగల వారముగా జీవించాలనేది దైవ సంకల్పం.
దేవుని దయ లేనిదే మనం ఎంత కష్టపడినా ఫలితాన్ని సాధించలేము. రైతు పొలాన్ని దున్ని, నీరు పెట్టి, ఎరువు వేసి పంటను పండించినా ఒక్కోసారి పకృతి వైపరిత్యాల వలన పంట సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. కారణం దేవుని దయ కాపుదల లేకపోవుటయే. కావున దేవుని దయ మీదే సర్వం ఆధారపడి ఉందని విస్వసిస్తున్నాం. సర్వకాల సర్వావస్థలయందు సమృద్ధియైన పంటనిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతార్పణలను అర్పించుకోవాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము (కీర్తన 95:2). అంతేకాకుండా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి (కీర్తన 100:4) అని దేవుని వాక్యముచేత హెచ్చరించబడుచున్నాము.
కృతజ్ఞత లేని వారు బ్రదికి యుండియు చచ్చిన వారితో సమానము. మానవ జాతి భ్రష్టమై పోవడానికిని, ప్రతి విషయంలోను అపజయానికి గురియై పోవడానికి గల ముఖ్యకారణం మానవునికి దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవుటయే. అందుకే “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి” రోమా 1:21. గనుక ప్రతి విశ్వాసి ప్రతి విషయంలోను దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించుకోవాలని దైవ వాక్యం నొక్కివక్కాణిస్తుంది. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నాల్గవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాలు ధ్యానించినట్లయితే అక్కడొక విశిష్టమైన విషయాన్ని చూస్తాము. దేవునిని ప్రేమించి ఆయన చిత్తానికి లోబడి సమర్పించిన కృతజ్ఞతార్పణలను దేవుడు అంగీకరించిన విధానమును మరియు హృదయశుద్దిలేకుండా ఆచారమును పాటిస్తూ అర్పించిన కృతజ్ఞతార్పణలను దేవుడు తిరస్కరించిన విధమును మనం గమనించవచ్చు. ఆది 4:1-5 “ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా”.
సృష్ఠిలో మొదటి సహోదరులు వీరు. వారు సమర్పించిన కృతజ్ఞతార్పణలలో ఏంతో వ్యత్యాసముంది. కయీను భూమిని సేద్యపరచువాడు. అతడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
హేబేలు గొఱ్ఱెలకాపరి, తన మందలో తోలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని కృతజ్ఞతార్పణగా తెచ్చెను. ఇద్దరు సమర్పించినవి కృతజ్ఞతార్పణలే గాని దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించాడు. ఈ తిరస్కారమునకు గల అసలు కారణం ఏమిటంటే
1) కయీను మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేదు; అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. హేబేలు మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొన్నాడు గనుకనే దేవుడతని అర్పణను అంగీకరించాడు.
2) కయీను సమరించిన అర్పణ ఆచారమును సూచిస్తూ ఉన్నాడు కనుకనే తిరస్కరించబడినది. హేబేలు సమర్పించిన సమర్పణ విశ్వాసముతో కూడు కొన్నది. ఎందుకనగా అతడు తన మందలో తోలు చూలు పుట్టిన వాటిని దేవునికి సమర్పించాడు. అందుకే అతని అర్పణ అంగీకరించబడింది.
3) కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పించాడే గాని పంటలో శ్రేష్ఠమైన వాటిని అర్పించలేదు అందుకే దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు. హేబేలు అయితే తోలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అనగా శ్రేష్ఠమైన వాటిని అర్పించాడు. అందుకే అతని అర్పణను దేవుడు అంగీకరించాడు.
హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడు అనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా!.
హేబెలును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమనగా హెబ్రీ 11:4 “విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.”
విశ్వాసముతో అర్పించిన అర్పణలను దేవుడు అంగీకరిస్తాడనియు, అర్పించిన వారు నీతిమంతులుగా తీర్చబడుతారు అనియు, అనేక విధములుగా దీవించబడుతూ పరలోక రాజ్యమునకు వారసులవుతారనియు తెలిసికొనుచున్నాము. అందుకే వాక్యం ఏమని బోధిస్తున్నదంటే, రోమా 12:1 “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను”
ఈ సందర్భంగా మరొక విశిష్ఠమైన విశ్వాసిని జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఎవరనగా 1 సమూయేలు గ్రంథం మొదటి రెండు అధ్యాయాలలో ఉన్న హన్నా అను స్త్రీ ని చూస్తాము. ఆమె తనకు తొలుచూలున పుట్టిన వాడును ఏకైక కుమారుడగు సమూయేలును, ఆమె దేవునితో చేసుకొన్న ఒడంబడిక ప్రకారము, దేవుని సేవకై షిలోహునందు ఉన్న దేవాలయములో దేవునికి సమర్పించి వేసియున్నది. దేవుడు ఆమెకు తనపట్ల గల ప్రేమను, విశ్వాసాన్ని, సమర్పణను చూచి ముగ్ధుడై ఆమెకు ముగ్గురు కుమాళ్ళను, ఇద్దరు కుమార్తెలను బహుమానముగా యిచ్చి దీవించారు. సామె 11:24 “వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.”అననీయ సప్పీరాలు, తగిన దానికన్నా దేవునికి తక్కువ యిచ్చి మరణం పాలయ్యారు. ఇటువంటి భయంకరమైన మరణాన్ని మనం తప్పించుకోవాలన్నా, హేబేలు వలె నీతిమంతులుగాను, హన్నా వలె అధికమైన దేవుని ఆశీర్వాదములు పొందాలంటే దేవునికి కృతజ్ఞతార్పణలను విశ్వాసముతోను, ప్రేమతోను, సమర్పణాభావంతోను హృదయపూర్వకంగా సమర్పించుకోవలసిన వారమై యున్నామని వాక్యము ద్వారా హెచ్చరింపబడుచున్నాము.
కీర్త 103:17,18 “ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.”
దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక. ఆమేన్.