సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి ... (ఆది 24:63).
మనం ఎంత ఒంటరివాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమౌతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురుచూడాలి. కాని మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడీ, అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పనిచేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది. ప్రశాంతతలోను, నిశ్శబ్దంలోను మనకి నమ్మకం లేదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహ లాడుతూ ఉంటాము. మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపికలేక మాటిమాటికీ వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతుంటాము. అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం. దేవునితో మాట్లాడడం పరలోకంవైపు తదేకంగా చూడడం, ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు. ఇలాటి ఆరుబయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే. ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం.
"ధ్యానముద్ర మానసిక ఆదివారం" అంటారు. మన మనస్సుకి సాధ్యమైనన్నిసార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాము. ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచెయ్యక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరచిన గొర్రెబొచ్చులాగా దేవుని ముందు పరచుకుని ఉంటుంది. ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనస్సు తడుస్తుంది. మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం. ఏమీ చెయ్యకుండా, ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేను వాల్చి విశ్రమించే సమయాలు అవసరం.
ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు. జాలరివాళ్ళు తమ వలలను బాగుచేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు. గడ్డికోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమనీ అనుకోడు. పట్టణాల్లో నివసించేవాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావుడీలనుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి. వేడిమి, శబ్దం, తొక్కిసలాటల నుండి దూరంగా, ప్రకృతికి చేరువగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది, అది హృదయాలను సేదదీరుస్తుంది. పొలాల్లో షికారు, సముద్రపు ఒడ్డున నడక, పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలికచేసి హృదయాన్ని సంతోషంతో, తాజాదనంతో ఉట్టిపడేలా చేస్తుంది.
నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను
నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను.