యెహోషువ


  • Author: Sajeeva Vahini - Joshua Book Explained in Telugu
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini - Telugu Bible Study

మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది.

మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్క సారాంశము. యెహోషువ నాయకత్వంలో దాదాపుగా 30 శత్రు సేనలను ఇశ్రాయేలీయులు జయించిరి. జయము అనునది సైన్యము యొక్క బలము వలన కాదుగాని, దానికి బదులుగా దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా సాధ్యము అని ఈ పుస్తకము నిరూపించుచున్నది. దీనివలె ధైర్యమును ప్రోత్సాహము, దైవజ్ఞానమును ఇచ్చు పుస్తకము పాత నిబంధనలో ఇంకొకటి లేదు అని చెప్పవచ్చును. 

పుస్తకము యొక్క పేరు: పుస్తకము యొక్క ముఖ్యమైన వ్యక్తి అయిన యెహోషువ పేరే ఈ పుస్తకమునకు పెట్టుట గమనించదగినది. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయా (Num13 8:1). “రక్షణ” అనునది ఈ పేరుకు అర్ధము. మోషేపేరును యెహోషువ అని మార్చినాడు. సంఖ్యాకాండము 13:16, “యెహోవాయె రక్షణ” అనునది దీని అర్ధము. గ్రీకు భాషలో యేసు అనునదే హెబ్రీభాషలో యెహోషువ. కనానును జయించే పనిలో ఇశ్రాయేలీయుల నాయకునిగా యెహోషువ ఉన్నప్పటికి నిజమైన జయశీలుడు దేవుడే అని ఈ పుస్తకము చెప్పుచున్నది.

భౌగోళిక పరిస్థితి: యెహోషువ పుస్తకములో మనము మూడు భౌగోళిక పరిస్థితులను చూచుచున్నాము. అవి యొర్దానునది, కనాను దేశము, 12 గోత్రములు నివసించిన స్థలములు.

ఉద్దేశము: ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించు కొనుటను వివరించుట

గ్రంథకర్త: యెహోషువ (చివరి భాగమును ఆయనతో ఉండిన ఫీనెహాసు వ్రాసియుండవచ్చును).

గతచరిత్ర: వాగ్దాన దేశమైన కనాను (ఇప్పటి ఇశ్రాయేలు దేశము).

ముఖ్యమైన వ్యక్తులు: యెహోషువ, రాహాబు, ఆకాను, ఫీనెహాసు, ఎలియాజరు.

ముఖ్యమైన స్థలములు: యెరికో, హాయి, ఏబాలు పర్వతము, గెరిజీము కొండ, గిబియోను, గిల్గాలు, షెకేము. 

ప్రత్యేకత: 20 లక్షల కంటె ఎక్కువ మంది ఐగుప్తు నుండి బయలుదేరినప్పటికి 20 సంIIలకు పైనున్న వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే వాగ్దాన దేశములోనికి అడుగిడిరి.

పుస్తకము యొక్క ముఖ్య భాగములు: స్వతంత్రించు కొనుట అనునది ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన మాట. ఇంకా ముఖ్యమైన భాగములు యెహోషువ 1:2-3; యెహోషువ 1:8; యెహోషువ 11:23; యెహోషువ 23:14

యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ చివరి సందేశమును విన్న ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేయుట. యెహోషువ మరణము, పాతి పెట్టుట అనునవియే ఈ అధ్యాయము యొక్క ముఖ్యాంశములు.

గ్రంథ విభజన: యెహోషువ గ్రంథమును రెండు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.

1 వాగ్దాన దేశమును జయించుట, Josh,1,1-13,7 వరకు 2 వాగ్దాన దేశమును పంచి గోత్రములను నివసింపచేయుట Josh,13,8-24,33 వరకు

ఈ భాగములలో కనబడే అంశముల విషయ సూచిక ఈ క్రింద ఇవ్వబడుచున్నది.

సైన్యమునకు కావలసిన ఆత్మీయత మరియు లోక సంబంధమైన సిద్ధపాటు 1 - 5 అధ్యాయములు, మోషే యెహోషువకు ఇచ్చిన ఆలోచనలు వేగుచూచుట, మొర్దాను, నూతన తరము వారి సున్నతి ఆచారములు ఈ భాగములో ఉన్నవి. మధ్య కనాను మీద యుద్ధమునకు పోవుట Josh,6,1-8,35 వరకు. దక్షిణ కనాను, ఉత్తర కనానుల మీద యుద్ధము చేయుట Josh,9,1-13,7 వరకు. పంచి పెట్టుట, నివాస స్థలము ఏర్పాటు చేయుట Josh,13,8-24,33 వరకు. ఈ భాగములో గోత్రము గోత్రముగా నివసించవలసిన స్థలములు వివరించుటలో కాలేబుకు హెబ్రోను కొండ ఇచ్చుట, ఆశ్రయ పురములను ఎన్నుకొనుట, లేవీయుల నగరములు, యెహోషువ చివరి సందేశము, మరణము, పాతి పెట్టబడుట మొదలగునవి చెప్పబడినవి.

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములోని 6వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 658; చరిత్రకు సంబంధించిన వచనములు 624; నెరవేరిన ప్రవచనములు 42; ప్రశ్నలు 21; దేవుని సందేశములు 14; ఆజ్ఞలు 98; హెచ్చరికలు 44; వాగ్దానములు 15.