ద్వారమునోద్ద కావలియున్న యొక చిన్నది పెతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు కాననెను (యోహాను 18:17). ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని (లూకా 22:33) యేసుతో పలికిన పెతురే ముమ్మారు యేసుని నేను యెరగను అని పలికిన శిష్యుడు.
యేసుని శిష్యుల పేర్లు వ్రాయునప్పుడు మొదటి పేరుగా సువార్తలలో పేతురు పేరు వ్రాయబడినది. యేసుని శిష్యులలో ఒకడైన పేతురు జీవితపు సంగతులను ఈ అంశములో తెలుసుకుందాం. ఈ సంగతులను మూడు భాగములుగా తెలుసుకుందాము. యేసు తనని పిలువక మునుపు, యేసుని వెంబడించు సమయము మరియు యేసు సిలువ వేయబడిన తరువాత. ఈ మూడు భాగాలలో పేతురును పిలచిన ఉద్దేశం మనకు తేటగా అర్ధమవుతుంది.
సీమోను పేతురు లేదా పేతురు అని ఆయన పేరు. పేతురు అను మాటకు అర్ధం కేఫా లేదా బండ. యేసు క్రీస్తు శిష్యుడు కాక మునుపు పేతురు ఒక జాలరి. చేపలు పడుతూ జీవనం సాగిస్తున్న అతన్ని తమ వలలు విడచి తన్ను వెంబడించుమని యేసు పలికిన వెంటనే సందేహపడకుండా తన సమస్తాన్ని విడిచిపెట్టి తనను వెంబడించి శిష్యుడయ్యాడు.
రెండవదిగా యేసును వెంబడించు సమయములో తన పరిచర్యలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉంటూ, ఒకనాడు యేసు మరియు సీమోను దోనెలోనుండి జనసముహములకు బోధించుట చాలించిన తరువాత చేపలు పట్టుటకు వెళ్లి సీమోనుతో, మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, రాత్రంతయు ప్రాయసపడిన యేమియు దొరకనివారు యేసు మాట చొప్పున వలలు వేయగా రెండు దోనెలు నిండునట్లు చేపలు పట్టిరి. యేసుని మాట ప్రకారము వలలు వేసిన సీమోను పేతురు విస్తారముగా ఫలితము పొందెను. అయితే రెండు దోనెల చేపల రాశిని చూచి విస్మయమొందిన సీమోను యేసు మోకాళ్ళయెదుట సాగిలపడి – ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను (లూకా 5:8) అయితే యేసు – నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని పేతురుతో చెప్పెను. పాపజీవితము గలవాడైన పేతురు యేసు పిలిచిన వెంటనే తన సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించెను(లూకా 4:11).
యేసుక్రీస్తుతో తన సహవాసం ఎంతగానో బలపడింది. యేసు నీళ్ళ మీద నడిచి వచ్చినప్పుడు తాను కూడా క్రీస్తు వలె నడువవలెనని కోరిక కలిగి కొంత దూరం మట్టుకు నడిచి సందేహపడినవాడై అవిశ్వాసానికి గురయ్యాడు. అట్టి స్థితి గల వాడైనప్పటికి క్రీస్తు ఎట్టి మరణం పొందబోవుచున్నాడో ముందుగా శిష్యులతో పలికిన యేసు పేతురుతో మాత్రం - “మరియు నీవు పేతురువు? ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను” అనెను. వ్యక్తిగత జీవితంలో దుడుకుతనం కలిగినప్పటికీ మరియు కేవలం శిష్యుడుగానే కాకుండా రాబోవు సంఘానికి పునాదిగా ఎంచబడ్డాడు మరియు పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అను ఆయుధములను కూడా అనుగ్రహించాడు. యేసు సిలివ వేయబడు సమయంలో కోడి కూయక మునుపు తనను యెరుగనని ముమ్మారు బొంకినవాడు ఈ పేతురే.
మూడవదిగా ప్రభువైన యేసు సిలువఫై మరణించి, తాను చెప్పిన ప్రకారము మూడవదినమున తిరిగి లేచెను. అప్పటికే పేతురు మరియు కొందరి శిష్యులతో తన పాత జీవనం సాగించాడు. వారు తిబెరియ సముద్రతీరమున కలసి చేపలు పట్టుటకు దోనె ఎక్కెను కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు. యేసు వారికి కనబడి కుడిప్రక్కన వల వేయమనగా వారు అ విధముగా వేసి విస్తారముగ చేపలు పట్టిరి. యేసు పెతురును చూచి – వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నవా? అని మూడు మార్లు అడగగా, పేతురు – ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పెను (యోహాను 21:17). యేసు – నా గొర్రెలను మేపుము అని చెప్పెను. మనుషులను పట్టు జాలరులనుగా చేతునని పేతురుతో పలికిన దేవుడు, తిరిగి మరల చేపలు పట్టుటనారంభించిన పేతురును తన ప్రజలను కాయుటకు మరల పిలిచెను.
యేసు క్రీస్తు ప్రభువు పునరుర్ధానుడైన తరువాత పేతురు విశ్వాసముతో నజరేయుడైన యేసు క్రీస్తు నామమున రోగులను స్వస్థపరిచెను మరియు బహు ధైర్యముగా వాక్యము భోదించుచుండెను. పేతురు రెండు పత్రికలు వ్రాసి, పరిశుద్ధ గ్రంధములో ఉన్న ఈ పత్రికలలో ఎన్నో విషయములను తెలియపరచాడు. పేతురు సుమారు AD 67 లో రోమా దేశములో తలకిందులుగా సిలువ వేయబడి మరణము పొందెను అని ఒరిగెన్ వ్రాసిన సంఘ చరిత్రలో వ్రాయబడడం ఆశ్చర్యం.
ఈ మూడు భాగాలలో పేతురు ఒక భిన్నమైన వాడుగా మనకు కనబడుతున్నాడు. మొదటిగా సందేహించని వాడై వెంబడించి, తరువాత సందేహించి నీటిలో మునిగి యేసు క్రీస్తు చేసిన అద్భుతాలను కళ్ళారా చూసి నమ్మి కూడా ముమ్మారు బొంకడమే కాకుండా మరలా పాత జీవితానికి తిరిగి వెళ్లి పోయాడు. మనం కూడా ఈ పేతురు వంటి వాళ్ళమే. తన పరిచార్యకు ఒకనాడు పిలువబడి శిష్యులముగా చేయబడి ఎన్నో అద్భుతాలను చూసిన మనం చిన్న చిన్న విషయాలలో సందేహపడి అవిశ్వాసానికి లోనవుతాము. దేవుడు మనపై కలిగిన ఉద్దేశాలను త్రోసివేసే వారముగా ఉంటాము. నిజముగా ఆయనను ప్రేమించిన వారమైన మనం ఆయన సిలువను గూర్చిన వార్తను చాటుటలో కృషి చేద్దాం. పిలువబడి తన పనిని జరిగించని మనం అనుదినం ఆయనను సిలువ వేయుచున్న వారితో సమానం. నిజమైన యేసు శిష్యులుగా నుండుటకు ప్రయత్నిద్దాం, అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక.