యాకోబు ఏశావులు కవల సోదరులు. ఏశావును ఎదోము అనియు పిలిచెడివారు. ఏశావు అనగా ఎఱ్ఱనివాడు అని అర్థము. ఏశావుకు ఎరుపు రంగుతో పలు సంబంధములు గలవు. అతని శరీరఛాయ ఎరువు. అతని బలహీనత ఎఱ్ఱని చిక్కుడు కాయల వంటకము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనుట. అతడు ఎఱ్ఱని బండలు గల దేశమును తన నివాస స్థలముగా చేసికొనెను. (ఆదికాండము 25:25; ఆదికాండము 25:30; ఆదికాండము 36:1) యాకోబు హారానులో 20 సంవత్సరములు నివసించినపుడు ఏశావు శేయీరు మన్యము ఎతైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమలో ఈ సెలానగరము, ఎఱ్ఱనిబండలతో నిండియున్నందునను, అతని పేరును బట్టి ఆదేశమును ఎదోము దేశమని పిలువబడెను. (ఆదికాండము 32:3) అది ఇంచుమించు 100 చదరపు మైళ్ల విస్తీర్ణము గల కొండ ప్రాంతము. ఎదోము దేశము (శేయీరు మన్యము) అరాబాకు తూర్పునను, మృతసముద్రమునకు దక్షిణమునను ఉన్నది.
ఎదోమీయుల మీదికి రాబోవుచున్న సంపూర్ణ నాశనమును గూర్చి ప్రవచించుటయే ఈ గ్రంథములోని విషయము. ఓబద్యా అనగా “యెహోవాను ఆరాధించువాడు”. లేక యెహోవాను సేవించువాడు అని అర్ధము.
గ్రంథకర్త : ఓబద్యా
కాలము : గ్రంథరచన జరిగిన కాలము వ్రాయబడలేదు.
గత చరిత్ర : ఎదోము దేశమునకు సెలా రాజదాని. సెలాను పెట్రా అనియు పిలుతురు. పెట్రా అనగా బండ అని అర్థము. చరిత్రలోని అద్భుతములలో పెట్రా నగరము ఒకటి. కొండల సందులలో ఈ అద్భుత నగరము నిర్మించిరి. దీనిని జయించుట శత్రువులకు సులభము కాదు. ఎత్తైన కొండ శిఖరముల పైనున్న పీఠభూమిలో ఈ సెలానగరము, యుండెను. కొండల మధ్య నుండు సందుల మార్గమున మాత్రమే ఈ సెలా నగరమున ప్రవేశించుట సాధ్యమగును. గొప్ప సైన్యముతో ఈ సందుల మార్గమున పయనించి ఈ నగరమును పట్టుకొనుట ఎవరికినీ సాధ్యము కాదు. చిన్న చిన్న గుంపులుగా ఎక్కి వచ్చి శత్రువులను ఓడించుట ఈ నగర వాసులకు సులభము.
నగరము బద్రముగా ఉన్నప్పటికి, దేవునితీర్పు నుండి తప్పించుటకు ఆ కొండలవలన కాలేదు. యెరూషలేము పతనమునకు ఐదు సంవత్సరములకు తరువాత బబులోను సైన్యము ఈ నగరమును జయించినట్టు చరిత్ర తెలుపుచున్నది. అయినప్పటికి మక్కబీయుల కాలములో ఎదోమీయులు తిరిగి శక్తి పొందినట్లు చూడగలము. యేసుక్రీస్తు పుట్టుక సమయములో యూదాలో పరిపాలించుచుండిన హేరోదు ఒక ఎదోమీయుడు క్రీ.శ. 70వ సంవత్సరములో టైటస్ రాజు యొక్క నాయకత్వములో వచ్చిన రోమా సైన్యము ఎదోమును సమూలనాశనము చేసిరి. ఆయన వీరిని కాల్చి ఏశావు యొక్క వంశములో శేషము లేకుండ భక్షించిరి అని 18వ వచనములో చెప్పబడిన ప్రవచనము ప్రకారము నెరవేరినది.
ముఖ్య పదజాలము : ఎదోము యొక్క న్యాయ తీర్పు.
ముఖ్య వచనములు : ఓబద్యా 1:10-21
నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఒక నెన్నటికిని లేకుండ మీరు నిర్మూలమగుదువు. (వచ 10) మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుట సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యెహోవాదియగును (వచ 21)
గ్రంథ విభజన : 21 వచనములను కలిగియున్న ఈ గ్రంథము పాతనిబంధనలో మిక్కిలి చిన్న గ్రంథము. అయినను న్యాయ తీర్పుతో నిండియున్న శక్తివంతమైన వర్తమానమును దీనిలో చూడగలము. విమోచింపబడు అవకాశమే లేనివిధముగా , ఎదోము దేశ నాశనమును ముద్రింనబడియున్నది. దేవుడు ఎదోమీయుల అహంకామునకు ప్రతీకారము చేసి యాకోబు వంశీయులను విమోచించు ననునదియే ఓబద్యా ప్రవచించిన సందేశము. ఓబద్యా గ్రంథమును రెండు భాగములుగా విభజింపవచ్చును.
- ఎదోము మీదికి రాబోవు న్యాయ తీర్పు (ఓబద్యా 1:1-16)
- ఇశ్రాయేలీయుల విమోచన (ఓబద్యా 1:17-21)
సంఖ్యా వివరములు : ఓబద్యా గ్రంథము పరిశుద్ధ గ్రంథములోని 31వ పుస్తకము. అధ్యాయములు 1; వచనములు 21; ఆజ్ఞలు 1; ప్రశ్నలు 4; వాగ్దానములు లేవు; హెచ్చరికలు 30; ఆ ప్రవచనములు మొత్తము 12; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 7; దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 3 (ఓబద్యా 1:1; ఓబద్యా 1:7; ఓబద్యా 1:15)