మార్కు సువార్తలోని వర్తమానమును ఒకే యొక వచనములో క్లుప్తపరచిన యెడల అది ఈ విధముగా చెప్పవచ్చును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. (మార్కు 10:45), ఈ పుస్తకం యొక్క ఒక్కొక్క అధ్యాయములో మెస్సీయ శ్రేష్ఠ జీవితమునకు కేంద్రబిందువుగా తెలియజేయునది త్యాగపూరితమైన ఆయన సేవయే.
తండ్రి చిత్తమునకు ఎల్లవేళల విధేయుడగుచు సేవలో నిమగ్నుడై ముందుకు కొనసాగుచున్న దాసునిగా మార్కు ప్రభువును చిత్రీకరించెను. వాక్యమును ప్రసంగించుచు రోగులను స్వస్థపరచుచు మరణము వరకు ఇతరుల అవసరములను నెరవేర్చు సేవలో యేసు నిమగ్నుడాయెను. పునరుత్థానుడైన తరువాత ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణ దాసులుగా ఆయన అడుగు జాడలలో నడిచే శిష్య బృందముగా ప్రభువు నియమించెను.
మార్కు అని పిలువబడుచున్న ఈ గ్రంథకర్తకు యోహాను అను మరొక పేరు కూడ ఉన్నది. (అపో. కార్యములు 12:12-15; అపో. కార్యములు 15:37
ఉద్దేశము : యేసు బోధనలను, క్రియలను తెలుపుట.
గ్రంథకర్త : మార్కు ప్రభువు శిష్యుడు కాడు. కాని పౌలు చేసిన మొదటి సువార్త దండయాత్రలో మార్కు ఆయనతోపాటు పాల్గొనెను. (అపో. కార్యములు 13:13)
ఎవరికి వ్రాయబడెను : రోమాలో నివసించుచున్న క్రైస్తవుల కొరకు రోములోనే ఈ గ్రంథము వ్రాయబడెను.
రచించిన కాలము : క్రీ. శ 55 - 65 కు మధ్య కాలము
గత చరిత్ర : తిబెరకైసరు క్రింద రోమా సామ్రాజ్యం ఉండినప్పుడు మహా సామ్రాజ్యమంతటను ఒకే భాషయు, పుష్కలమైన ప్రయాణ సౌకర్యములు, వార్తలు సమాచారములు అందించు సౌకర్యములు, బాగుగా నుండుట వలన అందరూ సువార్త విని అర్ధము చేసికొనవలెననియు సమస్త దేశములకును వేగముగా ఈ సువార్తను అందించు అవకాశములు ఏర్పడెను.
ప్రముఖ వ్యక్తులు : యేసు, ఆయన శిష్యులు (పండ్రెండుగురు) పిలాతు యూదమత నాయకులు
ముఖ్య స్థలములు : కప్నెహూము, నజరేతు, కైసరియ, యెరికో, బేతనియ, ఒలీవ కొండ, యెరూషలేము, గొల్గొతా.
గ్రంథ విశిష్టత : ఇది మొట్టమొదట వ్రాయబడిన సువార్త పుస్తకము. ఇతర సువార్తల కంటే ఎక్కువ అద్భుతములను మార్కు వ్రాసియున్నాడు. ( 18 అద్భుతములు, 4 ఉపమానములు)
మార్కు కాలము : నాలుగు సువార్తలలో మొదటిగా వ్రాయబడిన సువార్త మార్కు సువార్తయేనని పలువురు బైబిలు పండితులు అభిప్రాయబడుచున్నారు. అయినను దీని కాలమును నిర్దుష్టముగా తెలుప జాలము. దేవాలయ నాశనమును గూర్చిన ప్రవచనము ఇందులో వ్రాయబడియుండుటను బట్టి ఈ సువార్త క్రీ.శ 70కి ముందే వ్రాయబడియుండవచ్చును. అయితే క్రీ.శ. 64లో పేతురు హత సాక్షి మరణమునకు ముందో వెనుకో ఇది వ్రాయబడినదని చెప్పుటకు సాధ్యంకాదు. క్రీ.శ. 55కు 65 కు మధ్యలో సువార్త రచన కాలమని భావించుచున్నారు.
మార్కు రోమీయులను ఉద్దేశించి దీనిని వ్రాసెననుట సుస్పష్టము. అది కాలములోనున్న యూదా పారంపర్యమును బట్టి మార్కు రోములో ఉండిన కాలములో దీనిని వ్రాసెనని నమ్మవచ్చును. యూదులు గౌరవింపజాలని పలు ప్రాముఖ్య విషయములను మార్కు వ్రాయకపోవుటకు కారణము ఇది రోమీయులకు వ్రాయబడుటయే. క్రీస్తు వంశావళి, ఆయన జీవితములో నెరవేరిన ప్రవచనములు ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, ఇతర సువార్తలో ప్రాముఖ్యముగా కనిపించు యూదుల సంప్రదాయములు మున్నగునవి విడువబడినవి.
ముఖ్య పద సముదాయము : దాసుడైన యేసు.
ముఖ్య వచనములు : మార్కు 10:43-45; మార్కు 8:34-37.
ముఖ్య అధ్యాయము : 8వ అధ్యాయము. పేతురు - నీవు క్రీస్తువని ఆయనతో చెప్పిన విశ్వాస వాక్యమే అధ్యాయములో ప్రధాన సంఘటన. విశ్వాసముతో కూడిన ఈ ఒప్పుకోలు యేసు సేవలో ఒక నూతన పద్ధతి ప్రారంభమగుటకు కారణమైనది. అప్పటి నుండియు ప్రధానయాజకులు మున్నగు వారి వలన తాను పొందబోవు శ్రమలను తన మరణమును తన శిష్యులు ఎదుర్కొనవలెనని వారిని సంసిద్ధులుగా చేసెను. అక్కడ సంపూర్ణ బానిసగా సిలువ మరణము పొందుట ద్వారా దేవుని మహిమను వెల్లడించెను.
గ్రంథ విభజన : ఇది సువార్తలన్నింటిలో క్లుప్తమైనది. సులభ గ్రాహ్యమైనది. ఈ పుస్తకము యేసు జీవిత సంఘటనలు వేగముగా చూచుటకు చదువరులకు సహాయపడుచున్నది. యేసు చేసిన బోధలకంటె ఆయన సేవకు అధికముగా ప్రాముఖ్యతనిస్తున్న దీనిలో రెండు ముఖ్య భాగములు గలవు. మొదటి భాగము 1 - 11 అధ్యాయములు - యేసు పరిచర్యను, రెండవ భాగము 12 - 16 అధ్యాయములు, యేసు త్యాగమును తెలుపుచున్నవి. గ్రంథ విభజన వివరముగా ఈ క్రింద నీయబడినది.
1.సేవకుని పరిచర్య 1 - 10 అధ్యాయములు. (a). సేవకుని ఆగమనము Mark,1,1-2,12. (b). సేవకుడు ఎదుర్కొని ఆటంకములు Mark,2,13-8,26. (c). సేవకుడిచ్చిన ఉపదేశములు Mark,8,27-10,52.
- సేవకుని త్యాగము : 11 - 16 అధ్యాయములు. (a). సేవకుడు నిరాకరింపబడుటకు, Mark,11,1-15,47. (b). సేవకుని పునరుత్థానము మార్కు 16:1-20
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 41 వ పుస్తకము. - అధ్యాయములు 16; వచనములు 678; ప్రశ్నలు 121; నెరవేరిన పాత నిబంధన ప్రవచనములు 11; క్రొత్త నిబంధన ప్రవచనములు 30; చారిత్రాత్మక వచనములు 582; నెరవేరిన ప్రవచన వాక్యములు 43; నెరవేరనున్న ప్రవచన వాక్యములు 53.