ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

అగిన సమయమందు ధారాళముగ సహాయము చేసిన ఫిలిప్పీయ విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాసి పంపిన కృతజ్ఞతా వచనమే ఫిలిప్పీ వత్రిక అనవచ్చును. ఈ విధముగా లభించిన సందర్భమున క్రైస్తవ ఐక్యమత్యమును గూర్చి బోధించుటకు ఉపయోగించుకొనుచున్నాడు. దీని మూలభావము దీనమైనది. క్రీస్తునందు మాత్రమే నిజమైన ఐక్యమత్యము ఏర్పడగలదు. తగ్గింపు మనస్సునకును, పరిచర్యకును క్రీస్తును మన మాదిరిగా అంగీకరించినచో ఆలోచనయందును, మాటయందును, క్రియలయందును ఐక్యమత్యమును మనము చేకూర్చగలము. పౌలు తన అనుభవమునే దీనికి ఆధారముగ చూపుచున్నాడు. ఇది ఫిలిప్పీ విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైన వర్తమానముగనుండెను. ఫిలిప్పీ సఘమందు ఏకమై శ్రమించినవారు ఒకరికొకరు జగడములతో ఏసుక్రీస్తు సువర్తకు శత్రువులుగా జీవించిన కాలముగనుండెను. అందుకే పౌలు వారికిట్లు బోధించుచున్నాడు. కావున నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకము మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును”. (ఫిలిప్పీయులకు 4:1-7).

గ్రంథ రచయిత:- దీని రచయిత పౌలు అనుటకైన లోపలి, వెలుపలి ఆధారములు మిక్కిలి శక్తివంతమైనవి. కనుకనే దీనిని గూర్చి ఎవరును సందేహించలేదు.

వ్రాయబడిన కాలము:- క్రీ. పూ. 353లో మాసిదోనియా యొక్క ఫిలిప్పు రాజు (మహా అలెగ్జాండరు యొక్క తండ్రి) యీ పట్టణమును పట్టుకొని పెద్దదిగా చేసి దీనికి ఫిలిప్పీ అని పేరు పెట్టెను. క్రీ.పూ. 168లో రోమా అధికారులు దీనిని స్వాధీనపరచుకొనిరి. వెనుకటి కాలమును ఔగుస్తురాయుడు దీనిని ఒక సైన్యమును నిలుపు కేంద్రముగ మార్చెను. ఫిలిప్పీ ఒక వాణిజ్య పట్టణముగ లేక ఒక రాణువ కేంద్రముగ నుండుటచేతనే పౌలు యిచ్చటికి వచ్చునపుడు ఒక యూదా ప్రార్థనా మందిరము కూడా కట్టుటకు వీలు లేనట్లు యూదులు సంఖ్య యందు తక్కువగా నుండిరి.

     పౌలు యొక్క రెండవ సువార్త సేవా ప్రయాణమందు త్రోయయందు దొరికిన మాసిదోనియా ఆహ్వానము ప్రకారము అతడు యీ పట్టణమునకు వచ్చి సువార్తను ప్రసంగించెను. అప్పుడు లూదియయు మరి కొందరును మారుమనస్సు పొంది క్రైస్తవులైరి. పౌలు, సీలలు అచ్చట కొట్టబడి చెరసాలయందుంచబడిన సంభవము చెరసాల అధిపతియు అతని కుటుంబమును మారుమనస్సు పొందుటకు హేతువాయెను. రోమా పౌరసత్వము గల పౌలు, సీలలను విచారణ చేయకయే కొట్టి చెరసాలయందుంచుట, అచ్చట ఉద్యోగము చేసిన న్యాయస్థాన అధిపతులను సమస్యలకు యీడ్చెను. (అపో. కార్యములు 16:37-40) ఇది నూతనముగ క్రైస్తవులైన ఆదేశ ప్రజలు అధిక శ్రమల నుండి తప్పించుటకు సహాయపడియండవచ్చును. తన మూడవ సువార్త సేవా ప్రయాణమందు పౌలు మరల యీ పట్టణమునకు వచ్చెను. (అపో. కార్యములు 20:1) పౌలు రోమాయందు బంధించబడుటను వినినప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు సహాయనిధితో ఎపఫ్రోదితును రోమాకు పంపిరి. (ఫిలిప్పీయులకు 4:18) మరి రెండుసార్లు యీ విధముగ వారు పౌలుకు సహాయపడిరి. (ఫిలిప్పీయులకు 4:16) రోమా యందు ఎపఫ్రోదితు వ్యాధిగ్రస్తుడై మరణ ద్వారమునకు వెళ్ళెను. అతడు స్వస్థత పొందిన వెంటనే పౌలు యీ పత్రికను వ్రాసి అతని చేతికిచ్చి అతనిని మరల ఫిలిప్పీకి పంపెను. (ఫిలిప్పీయులకు 2:25-30).

     పౌలు, సీల, తిమోతి, లూకా మొదలగు వారు మొదట క్రీ.శ. 51లో ఫిలిప్పీకి వచ్చిరి. దాని తరువాత 10 సంవత్సరములకు క్రీ.శ 61లో పౌలు యీ పత్రికను వ్రాసెను. ఫిలిప్పీయులకు 1:13; ఫిలిప్పీయులకు 4:32 మొదలగు వచనములు యీ పత్రిక రోమా నుండి వ్రాయబడుటను చూపుచున్నవి. రోమా చెరలో పౌలు బంధించబడి యున్నప్పుడు, ఆ సామ్రాజ్యపు అధిపతులు అతనికి ఎట్టి తీర్పు నిచ్చెదరని ఎదురు చూచుచు దినములను గడుపుచుండిరి.

ముఖ్య పదము:- జీవించుచున్న క్రీస్తు.

ముఖ్య వచనములు:- ఫిలిప్పీయులకు 1:21’; ఫిలిప్పీయులకు 4:12.

ముఖ్య అధ్యాయము:- ఫిలి: 2

యేసుక్రీస్తు యొక్క తగ్గింపు మనస్సును గూర్చి గల ప్రత్యక్షతలోనే క్రొత్త నిబంధన సత్యము యొక్క వున్నత మహిమ సంక్షేపమైయున్నది. ఈ అధ్యాయమందు ఆ తగ్గింపు యొక్క అద్భుత మహిమను పౌలు చూపుచున్నాడు. కొనసా గండి “క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సును మీరును కలిగియుండుడి” అని ఉపదేశమును ఇచ్చుచున్నాడు.

గ్రంథ విభజన:- అసాధారణ పరిస్థితుల మధ్య మ్రోగు సంతోష ప్రవాహము యొక్క ధ్వనియే ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ క్రైస్తవుల పట్ల గల తమ ప్రేమను ప్రతిఫలింపజేయుటతో బాటు వారి స్థిరమైన సాక్ష్యమును, ధారాళమైన సహాయమును పొగడి, పోటీలు, ఐక్యమత్యము లేకపోవుటను విడిచి పెట్టి క్రీస్తు యేసునకు గల మనస్సుతో ముందుకు సాగివెళ్ళునట్లు అపొస్తలుడైన పౌలు వారికి బోధించెను పత్రిక యొక్క నాల్గు ముఖ్య అభిప్రాయములు క్రిందయివ్వబడెను: -

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 50వ పుస్తకము; అధ్యాయములు 4; వచనములు 104; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 96; నెరవేర్చబడని ప్రవచనములు 5.