వృద్ధుడును, అనుభవజ్ఞుడును అయిన అపొస్తలుడైన పౌలు, యౌవనస్తుడును, ఎఫెసు సంఘ సేవకుడనైన తిమోతికి వ్రాయు పత్రిక ఇది. తిమోతికి వున్న బాధ్యత ఒక పెద్ద సవాలుగనుండెను. సంఘముయందుగల అబద్ధ బోధనలను దూరపరచవలెను, సామాన్య ఆరాధన ఫలించదగినదిగా యుండవలెను. సంఘము పరిపక్వమైన అధ్యక్షతను పొందినదిగా చేయవలెను. సంఘ స్వభావమును కాపాడుట కంటెను పరిచారకుని స్వభావమును భద్రముగా కాపాడవలెను. తిమోతి యొక్క యౌవ్వనము సువార్త సేవకు గొప్ప స్వాస్థ్యముగానుండవలెనే గాని సంఘమును బాధించునట్టిదిగా ఉండకూడదు. అదే సమయమందు ఒక ఆత్మీయ మనుష్యునికి అవసరమైన నీతి, దైవ భక్తి, విశ్వాసము, ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు మొదలగు వాటిని విడువక అనుసరింపవలెను.
ఉద్దేశము:- యౌవ్వనుడైన తిమోతికి సలహానిచ్చి అతనిని ప్రోత్సాహపరచుట.
గ్రంథ కర్త:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- తిమోతికి, యౌవ్వనులైన సంఘ అధ్యక్షులకును ఇతర విశ్వాసులకును.
వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.64లో రోమా నుండి లేక మాసిదోనియా నుండి (ఇంచుమించు ఫిలిప్పీ). పౌలు యొక్క చివరి రోమా చెరసాల వాసమునకు కొంచెము ముందు.
ఆంతర్యము:- పౌలుకు మిక్కిలి సమీపమైన తోటి సేవకుడిగా తిమోతి ఉండెను. ఎఫెసు సంఘములో ఏర్పడిన తప్పుడు బోధనలను ఎదురించుటకు అతనిని అచ్చటకి పంపెను. (1 తిమోతికి 1:3-4) ఎఫెసు సంఘ సేవకునిగ తిమోతి కొన్ని దినములు పరిచర్య చేసి ఉండవచ్చును. పౌలు అతనిని చూచుటకు ఆశించెను (1 తిమోతికి 3:14-15; 1 తిమోతికి 4:13) అంతకు ముందు పరిచర్య యందు ఎరిగి యుండవలసిన అనుచరణ యందున్న కార్యములను గూర్చి ఈ పత్రిక వ్రాసెను.
ముఖ్య పాత్రలు:- పౌలు, తిమోతి
ముఖ్య పదజాలము: - సంఘము ఏర్పాటు యొక్క అధ్యక్షత
ముఖ్య వచనములు:- 1 తిమోతికి 3:15-16; 1 తిమోతికి 6:11-12.
ముఖ్య స్థలము:- ఎఫెసు
గ్రంథ విశిష్టత:- ఈ పత్రిక సంఘ పరిపాలనను గూర్చియు శిక్షా విధానములను గూర్చిన ఒక వ్యక్తికి సంబంధించిన ఒక పత్రికయగును.
ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 3. దేవుని సంఘపు బాధ్యతను వహించి పరిచర్య చేయు వారి అర్హతలను ఈ అధ్యాయమందు పౌలు వివరించుచున్నాడు. మనమిచ్చట చూచునది లోక జీవిత విజయము కొరకైన అర్హతలను కాదు. యధార్ధమైన సంఘ అధ్యక్షత కొరకైన అర్హతలను దేవునితో నడచుట ద్వారా మాత్రమే పొందవచ్చును.
గ్రంథ విభజన:- తమ జీవితపు అంతమున క్రీస్తు సువార్త సేవయందు తోటి పరిచర్య చేసిన వానికి పౌలు వ్రాసిన పత్రికలే “ కాపరి పత్రికలు”. (1తిమోతి, 2తిమోతి, తీతు) అపొస్తలుడైన పౌలు ఒక వ్యక్తికి వ్రాయు పత్రికలు ఇవి మూడు మాత్రమే. ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక మాత్రమే ఒకనికి వ్రాసినట్లు వున్నది. వాస్తవమునకు అది పలువురికి వ్రాసిన ఒక పత్రికయే. ఎఫెసునందు క్రేతునందున్న సంఘములన్నిటి దృఢవిశ్వాసమును గురియందుంచుకొని వ్రాయబడినవే ఇవి. 1తిమోతి యందు పౌలు యొక్క ఐదు ప్రమాణములిమిడియున్నవని చెప్పగలము.
(1) బోధనను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.1
(2) సామాన్య ఆరాధనను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.2,3
(3) అబద్ధపు బోధకులను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.4
(4) సంఘ క్రమశిక్షణను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.5
(5) కాపరుల లక్ష్యములను గూర్చిన ఆజ్ఞ - అధ్యా.6
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 54వ పుస్తకము; అధ్యాయములు 6; వచనములు 114; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 106; నెరవేర్చబడిన ప్రవచనములు 5; నెరవేర్చబడని ప్రవచనములు 2.