అశక్యము కాని సమస్యలతో నిండిన జీవిత పరిస్థితులలో క్రైస్తవ ప్రేమ క్రియా రూపము పొందునా? ఉదాహరణకు ధనవంతుడైన ఒక యజమానియు, అతని యొద్దనుండి పారిపోయిన అతని బానిసయు తమలో ప్రేమించుకొనగలరా? గలరు అనుటలో పౌలునకెట్టి సందేహమును లేదు. ఒకదినము ఫిలేమోను చెంత నుండి పారిపోయిన దొంగయు, దుష్టుడునైన ఒనేసిము అను దాసుని కొరకు పౌలు ఆ యజమానునికి వ్రాయు ఒక లేఖయే ఈ పత్రిక. మునుపు అతడు నిష్ప్రయోజకుడును, సమస్యలకు కారకుడునైన ఒక దాసుడిగా నుండెను. ఇప్పుడైతే అతడు క్రీస్తునందు ప్రియమైన సహోదరునిగా నుండెను. పౌలును ఎంత మిక్కుటమైన ప్రేమతో ఫిలేమోను ఆహ్వానించునో అదే ప్రేమతో ఒనేసిమును అంగీకరించుమని మిక్కిలి తేటగా ఫిలేమోనుకు వ్రాయుచున్నాడు. ఒనేసిము ఫిలేమోను గృహము నుండి దేనినైననూ ఆకర్షించి తీసుకొనినను, పోగొట్టుటకు కారణముగానున్నను దానిని తిరిగి ఇచ్చెదనని పౌలు వాగ్దానము చేసెను. సహోదర ప్రేమ, క్షమాపణను, కనికరమును ఈ పరిస్థితి యందు విజయము పొందునని పౌలుకు పరిపూర్ణ విశ్వాసముండెను.
ఉద్దేశము: - ఫిలేమోను యొద్దనుండి పారిపోయిన దాసుడైన ఒనేసమును క్షమించుటకును విశ్వాస సహోదరునిగా అతనిని గౌరవించుటకును వేడుకొనుట.
గ్రంథ కర్త:- పౌలు
ఎవరికి వ్రాసెను?:- ఫిలేమోనుకు. ఇతడు కొలొస్సైయ సంఘమందు గల ధనవంతుడైన ఒక సభ్యుడిగా నుండి యుండవచ్చును.
వ్రాయబడిన కాలము: - క్రీ.శ. 61 నుండి రోమా చెరసాల కాలమందు దీనిని వ్రాసెను. ఈ కాలమందే ఎఫెసీ, కొలొస్సై మొదలగు పత్రికలను వ్రాసెను.
గ్రంథ కర్త:- ఫిలేమోనుకు 1:1; ఫిలేమోనుకు 1:9; ఫిలేమోనుకు 1:19 మొదలగు మూడు వచనములను పౌలు ఈ పత్రికను వ్రాసెననుటకైన ఆధారములగును. కొలొస్సయులకు 4-14:1 మొదలగు వచనములను ఫిలేమోనుకు 1:10; ఫిలేమోనుకు 1:23-24 మొదలగు వచనములను పోల్చి చూచినచో యీ రెండు పత్రికలందును గుర్తించబడు మనుష్యుడు ఒకే వ్యక్తియని తెలియుచున్నది.
వ్రాయబడిన కాలము:- ఈ పత్రిక మరియు కొలొస్సై పత్రిక యొక్క ముఖ్య భాగములను పోల్చి చూచినచో పత్రికకు ఆధారమైన చారిత్రిక సంభవములను క్రిందనున్నట్లు పోల్చి చూడవచ్చును.
ఫిలేమోను కొలొస్సైయందు నివసించిన ఒక ధనవంతుడు. అతని భార్య పేరు అప్పియ. అతని కుమారుని పేరు ఆరిప్పు. (కొలొస్సయులకు 4:9; కొలొస్సయులకు 4:17; ఫిలేమోనుకు 1:1) అచ్చట గల సంఘము అతని యింటనే కూడుచుండెను. ఫిలేమోను కుమారుడైన అర్ఖిప్పు సంఘమందు ముఖ్యమైన ఒక పరిచారకుడుగా నుండెను. (కొలొస్సయులకు 4:17). ఫిలేమోను దగ్గర పని చేయుచున్న అనేకులలో ఒనేసిము ఒకడుగానుండెను. యజమానుని వస్తువులను అపహరించిగాని లేక ఏదైనను నేరమును యజమానునికి విరోధముగ చేసిగాని అతడు తన యజమానుని విడిచి దూరముగ పారిపోయెను. భద్రత కొరకై ప్రజలతో క్రిక్కిరిసియున్న రోమును చేరెను. తన యజమానుని మారు మనస్సునకు ముఖ్య కారకుడును, అలవాటు పడిన వాడునైన పౌలును అచ్చట కనుగొనెను. అచ్చట అతడు మారు మనస్సు పొంది క్రీస్తునందు ఒక నూతన వ్యక్తిగ మారెను. పౌలుకు మిక్కిలి ఉపయోగకరమైన ఒక సహోదరునిగ కొంత కాలము సహాయము చేయుచు రోమాలో నివసించెను. యజమానుని యొద్దకు మరల వచ్చుట అవశ్యకమని పౌలును ఒనేసిమును గ్రహించిరి. అప్పుడు కొలొస్సై పత్రికను వ్రాసి తుకికు దగ్గర యిచ్చి పంపుటకు పౌలు తీర్మానించెను. వెంటనే ఒనేసిమును తుకికుతో కలసి కొలస్సైకి పంపుటకు తీర్మానించి అతని చేతికి ఫిలేమోనుకు వ్రాసిన పత్రికనప్పగించెను.
ఒనేసిమును ఒంటరిగ పంపక తుకికుతో కలిసి పంపు కారణము, ఇటువంటి దాసులను పట్టుకొను అధికారుల యొద్ద నుండి కాపాడుట కొరకైన ఉద్దేశముగా నుండవచ్చును. ఆ కాలమందు పారిపోయిన దాసులు కనుగొనబడినట్లయినచో వారికి కఠిన శిక్ష విధించబడును. కొన్ని సమయములందు కనికరము లేక మరణ శిక్ష నిచ్చుట అలవాటుగా నుండెను. ఒనేసిము ఒక క్రైస్తవునిగా మారినట్లైనచో పౌలు యిటువంటి ఒక పత్రికను వ్రాసి చేతికిచ్చినను అతడు తిరిగి వెళ్ళి యుండడు.
పౌలు యొక్క చెరసాల పత్రికలలో ఒకటైన యీ పత్రిక క్రీ.శ.61లో వ్రాసియుండవచ్చును. (ఎఫెసి, ఫిలిప్పీ, ముఖ్యముగా కొలస్పై వంటి పత్రికల ప్రారంభమందు చూడుము.)
ఆంతర్యము:- బానిసత్వము రోమా సామ్రాజ్యమందు సామాన్యమైన ఒకటిగా నుండెను. సంఘ విశ్వాసులలో పలువురికిని బానిసలుండిరి. తన పత్రికలందు బానిసత్వ సంబంధమైన ఆజ్ఞలు ఏవియు గుర్తించబడలేదు. అయితే యీ బానిసను ఫిలేమోను యొక్క క్రీస్తునందలి సహోదరుడని పౌలు చెప్పునప్పుడు ఆ బానిసత్వ స్థితి నుండి ఒక మూలాధారమైన మార్పును ఏర్పరచుచున్నాడు.
ముఖ్య పాత్రలు:- పౌలు, ఫిలేమోను, ఒనేసిము.
ముఖ్య పదము:- క్షమించు
ముఖ్య వచనములు:- ఫిలేమోనుకు 1:16-17.
ముఖ్య స్థలములు:- కొలొస్పై, రోమా
గ్రంథ విశిష్టత:- ఇది ఒక స్నేహితునికి పంపిన ఒకనికి సంబంధించినవియు వ్యక్తిగతమైనదియునైన ఒక పత్రిక.
గ్రంథ విభజన: - పౌలు పత్రికలలో బహు చిన్నది. గ్రీకు భాషలో 334 పదములు మాత్రము ఉన్న పత్రిక యిది. మరియొక రీతిలో చూచినట్లైనచో మరణ శిక్షకు పాత్రుడైన ఒక వ్యక్తి దగ్గర పౌలు చూపు ప్రేమ, ఆపేక్ష, క్షమాపణ, దేవుని ప్రేమకు ఒక విశేషమాదిరి అగును. మూడు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.
(1) ఫిలేమోను కొరకు కృతజ్ఞత తెలుపు ప్రార్ధన. 1-7.వచ.
(2) ఒనేసిము కొరకు ప్రార్థించుట. వచన.8-16.
(3) ఫిలేమోనుకు పౌలు యొక్క వాగానము. వచ.17-25.
కొన్ని ముఖ్య వివరణలు: - పరిశుద్ధ గ్రంథము యొక్క 57వ పుస్తకము ; అధ్యాయము 1; వచనములు 25; ప్రశ్న 1; ప్రవచనములు లేవు.