పేతురు వ్రాసిన రెండవ పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

పేతురు యొక్క మొదటి పత్రిక సంఘపు వెలుపలి వారి సమస్యలను సరిదిద్దునపుడు రెండవ పత్రిక సంఘపు లోపలి సమస్యలను సంధించవలసినదిగా నుండెను. అపాయకరమైన అబద్ధ బోధనలను బోధించు బోధకులను ఖండించి మాటలాడుచున్నాడు. వారి వ్యక్తిగత జీవితాలను పరిశుద్ధముగా కాపాడుకొనునట్లు బుద్ధి చెప్పుచూ అతడు ఈ పత్రికను వ్రాసెను. యథార్ధమైన మహిమ, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదరప్రేమ, నిష్కపటమైన ప్రేమ మొదలగు వాటిననుసరించి వెంబడించుటయే క్రైస్తవ్యము యొక్క గురి. ఇందుకు వ్యతిరేకముగా అబద్ధ బోధకుల జీవితములో కనిపించునది చూడగా శరీరాశ, స్వార్ధము, దురాశ, స్వలాభాపేక్ష మొదలగునవి. రాబోవు కాలములో జరుగనైయున్న న్యాయ తీర్పును వారు హేళన చేయుచు నిరాకరించి ఇప్పుడు కనిపించునదే భవిష్యత్కాలపు మాదిరి అను మనస్సుతో జీవించుచున్నారు. దేవుని న్యాయ తీర్పును జ్ఞాపకము చేసికొని దాని వెలుగులో పరిశుద్ధతను, నిష్కల్మషమైన జీవితము గడుపుటకు అతడు విశ్వాసులను పిలుచుచున్నాడు.

యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు” అని 2 పేతురు 1:1 లో పత్రిక లేఖికుని గూర్చి విశదముగా చెప్పబడుచున్నది.

ఉద్దేశము:- అబద్ధ బోధకులను గూర్చిన హెచ్చరిక నిచ్చుట, వీరు విశ్వాసమునందును జ్ఞానమునందును ఎదుగుటకు పిలుచుట.

గ్రంథకర్త:- పేతురు.

ఎవరికి వ్రాయుచున్నాడు?:- సంఘములకు

వ్రాసిన కాలము:- ప్రియులారా ఈ రెండవ వత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను అని 2 పేతురు 3:1లో సూచించి చిన్న ఆసియలోని అదే విశ్వాసులను మనస్సునందుంచుకొని ఈ పత్రిక వ్రాయబడినది. అయినను 2 పేతురు 1:1 లో చెప్పుచున్న “మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి” అను పదజాలము మిక్కిలి చదువ ప్రోత్సాహపరుప సూచించునట్టిదిగాను భావింపవచ్చును. సంమములో నుండి వెలువడినవియును, అందు మూలముగా మిక్కిలి ఆపదను పెంపొందించునట్టివిగానున్న అబద్ధ బోధకులకు బుద్ధి చెప్పుటకు పేతురు ఈ పత్రికను వ్రాసెను. ఇట్టి అబద్ధ బోధకులు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను ఉపదేశమును నిర్మూలము చేయు వ్యతిరేక స్వభావమును క్రమమునకు విరుద్ధమైన బ్రతుకును పురికొల్పిరి (2 పేతురు 3:1-7).

ఈ పత్రిక అపొస్తలుల మరణమునకు కొంచెము ముందుగా రోమాలో నుండి వ్రాయబడినదిగా యుండియుండవచ్చును (2 పేతురు 1:14). పేతురు క్రీ.శ 64 నుండి 66 వరకు మధ్య కాలములో హతసాక్షియాయెను. తిమోతి రోమాలో నున్నప్పుడు పేతురు ఉండి యుండినట్లయితే అతనిని గూర్చిన సూచనలు ఇందులో కనబడియుండవలెను.

ఆంతర్యము:- తన ఆఖరి రోజులు సమీపించెనని పేతురు గుర్తించెను (2 పేతురు 1:13-14). గనుకనే తన హృదయాంతరంగము నుండి తన తరువాత ఏమి సంభవించునది వ్రాయుచున్నాడు. ముఖ్యముగా అబద్ధ బోధకులను గూర్చియు సువార్త యొక్క నిశ్చలమైన నిజత్వస్థితిని గురించియు జ్ఞాపకము చేయుచున్నాడు. ముఖ్య పదజాలము:- అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరికగా నుండుడి.

ముఖ్య వచనములు:- 2 పేతురు 1:20-21; 2 పేతురు 3:9-11.

ముఖ్య అధ్యాయము:- 2 పేతురు 1.

గ్రంథ విభజన: - మొదటి పత్రిక జీవవాక్యము ద్వారా రానైయున్న నూతన జన్మను గూర్చి దృఢముగా చెప్పునపుడు రెండవ పత్రిక కృప ద్వారాను క్రీస్తునందలి జ్ఞానముగల ఎదుగుదలకు ప్రధానత్వమును యిచ్చుచున్నది. మూడు ముఖ్య భాగములు ఈ వత్రికనందున్నవి.

  1. క్రైస్తవ ధర్మమును ఏర్పరచుట.- అధ్యాయము 1.
  2. అబద్ధ బోధకులకు శిక్షా తీర్పు. - అధ్యాయము 2.
  3. క్రీస్తు యొక్క రాకడ పట్ల గల విశ్వాసము. - అధ్యాయము 3.

కొన్ని వివరముల గుర్తింపులు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 61వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 61; ప్రశ్నలు 2; చారిత్రక వచనములు 51; నెరవేరిన ప్రవచనములు 2; నెరవేరని ప్రవచనములు 8.