అనేక సంవత్సరాలుగా బంధీగా, బానిసగా నలుగుతున్నప్పుడు ఏ మార్గమయినా సరే తప్పింపబడటమే ప్రధానమనిపిస్తుంది. తప్పించబడే, విడిపింపబడే సమయం ఆసన్నమైనప్పుడు, ఆ ఆలోచనా మార్గంవైపు నడుస్తున్నప్పుడు తెరుచుకొనే ద్వారాలు, మార్గాలు నిలువబడిన మానసిక స్థితికి అర్థం కాకపోవచ్చు. తప్పింపబడుతున్నామనే ఆలోచన ఉంటుందిగానీ, తప్పింపబడి ఒక గమ్యంవైపు ప్రయాణం ఉంటుందని అర్థం కాదు. నడుస్తున్న అడుగులకు కనుచూపుమేరా తెరవబడిన మార్గం కానరాదు.హోరెత్తించే జలములు సముద్రమై కళ్ళకు కన్పించి భయపెడుతుంది. వెనువెంట తరిమే లోకనాధుల హాహాకారాలు చెవులకు వినబడి భయాన్ని రెట్టింపుచేస్తాయి. నలుమూలనించి కానరాని మార్గంతో, మరణమేదో వెంటాడుతున్నట్టు, మ్రింగుతున్నట్టు కన్పిస్తుంది. ఆ భయాలకు లొంగితే దేహపు జవసత్వాలు జారి, వణికిస్తాయి. బానిసగానో, బంధీగానో ఉన్నస్థితే బాగుందనిపిస్తుంది. మరెన్నడూ ఆరిన నేలను దర్శించడం కష్టతరమైపోతుంది.
మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. . నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. నిర్గమ 14:.21-22
మోషేను నడిపించిన దేవుడు నిన్ను, నన్నూ నడిపిస్తాడు. తరుముకొస్తున్నవాటిని మరచి హోరెత్తించే అలలవైపు చెయ్యిచాపగలిగితే ఆరిన నేలను నడవటం కష్టమైనదేమీ కాదు. ఆరిన నేలను దర్శించడానికి విశ్వాసపు సాహసం కావాలి.