యోసేపు అనగా దేవుడు వృద్ధి చేయును (God will increase)
మిద్యానీయులైన వర్తకులు .. యోసేపును .. ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. ఆది 37:28
రాబోయే కరువును తప్పించడానికి నిలబడే ముఖద్వారంలాగా నిలబెట్టడానికి దేవుని ప్రణాళిక సిద్దమైనప్పుడు వయస్సు ఏదైనా, మనస్సులో ఓ కల చిత్రమై నిలుస్తుంది. కల, వాస్తవాల చిత్రాలు కొత్త, కొత్తగా కన్పిస్తాయి. కలలో నిలిచిన పనను తొక్కిపట్టాలని ప్రయత్నాలు ప్రారంభమయి కుట్రలో, కుతంత్రాలో ఎగసి, కత్తి దుయ్యాలని సైతం ప్రయత్నిస్తాయి. "అసహనం", "అసూయ" అదనుకోసం ఎదురుచుస్తుంటాయి.
కల వాస్తవరూపం దాల్చాలంటే మార్పు కావలసిందేనంటుంది దైవ నిర్ణయం. ఒంటరిగా స్వస్థలాన్ని విడిచి, స్వజనులును విడిచి వెళ్ళాల్సిందే! గమ్యం తెలిసినా తెలియకున్నా ప్రయాణించాల్సిందే! "కలే" నిరంతరం కన్నుల్లో మెదులుతున్నప్పుడు చూస్తున్న వారికి వెర్రితనంగానో అజ్ఞానంగానో కనిపిస్తుంది. వాస్తవానికి వ్యతిరేకమై, వస్త్రాన్ని కోల్పోయి, అవమానింపబడి, అమ్మివేయబడినప్పుడు బాధ గుండెను పిండేస్తుంది. మరణాన్ని కౌగిలింపచేయాలనే పథకాలు రచించబడతాయి. నిలువలేని కుట్రలకు నిరాశచెంది జీవితాశయాలు దారితొలుగుతాయి. బహుశ... తల వంచే బానిసగా నిలబడాల్సివస్తుంది.
బాధలోను బానిసతనంలోను కూడా మనసులో నిలుపుకున్న సత్ ప్రవర్తనా వస్త్రం పుటంవేయబడి కొత్తమెరుపును, బుటాపనులను, అలంకరణలను తెస్తుంది. తిరిగే కాలచక్రంలో నలుగుతున్నరోజుల్లో పడి "కల" మరుగునపడినట్టే అన్పిస్తుంది. ప్రణాళికలోని అంతర్భాగం వాస్తవాలను గమ్యానికి తెలియకుండానే నడిపించడానికి ఎగుడు, దిగుడుల అనుభావలతో రాజమందిరంలోంచి ఖైదీని చేస్తుంది. ఖైదీల మధ్యనుండి విడుదలనిచ్చే అధికార పీఠంవైపు నడిపిస్తుంది.
రోజులో..నెలలో.. సంవత్సరాలో..వేచియుండాల్సిందే!
రాటుదేలిన "సత్ప్రవర్తన" రాబోయేకాలంలోని జనులకు ఆహారాన్ని వడ్డించే ఆహారశాల ప్రధాన గుమ్మం దగ్గర నిలబడి ఎందరినో ఆహ్వానించి ఆదరించే రాజ దండమౌతుంది. కల వాస్తవం అవుతుంది. వాగ్ధానం నెరవేరుతుంది.
ఓర్పుతో సహనంతో దేవుని ప్రణాళికలను మన జీవితంలో నెరవేర్చడానికి సిధ్ధమవుదామా?
ప్రభువు మీతో వుండును గాక! ఆమెన్