తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు మనసును ముసురుకుంటాయి. సూర్యరశ్మిని కురవని మేఘం కమ్మేసినట్టు విశ్వాసంపై తెరలాగ కప్పేస్తుంటాయి. దేవుడు మనకు తోడు వున్నాడనే విషయాన్ని మరుపు పొరల్లోకి తోచేస్తుంది. దొర్లుతున్న పడకపై నలుగుతున్న పక్కదుప్పటిలా ఆలోచనలు నలుగుతుంటాయి. ప్రార్థించడమంటే దీనంగా ఈ పరిస్థితినుండి విడిపించమని వేడుకోవడమే అన్పిస్తుంది. ప్రార్థనంటే ఆయనతో సంభాషించడమే కదా! మరెందుకో ఆవిషయమే గుర్తుకు రాదు. ఇలాంటప్పుడు పదేపదే నేను చేప్పే మాటొకటి గుర్తుకొస్తుంది.
ఈ అనుభవాన్ని ఇలా కలిగివుండటంలో ఏదైనా ప్రయోజనం దాగివుందేమో! ఈ ఆలోచన నెమరేస్తూ వుంటే ఊరటకలుగుతుంది. ఎంత కురవని మేఘమైనా సూర్యరశ్మిని అడ్డుకోలేక తప్పుకోక తప్పదు. మెల్లగా ఆయనతో సంభాషణ మొదలౌతుంది. తెరతొలగిన ఆకాశాన్ని ఒకసారి చూడు కొత్తరంగుల శోభను అలంకరించుకుంటుంది. అప్పటివరకు బండసందుల్లో వున్న పావురాలు ఒక్కుమ్మడిగా ఎగరడం చూస్తావు. ఎంత ఆహ్లాదమో కదా దేవుని క్రియలు. ఇక స్తుతి నాలుకపై కదలాడుతుంది.
కీర్తనాకారుడంటాడు.."నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" కీర్తనలు 119:71
క్రీస్తు నావైపుంటే విజయ పరంపర నావెంటే!!
భయపెడ్తున్న శ్రమలు, బాధలు సింహాల్లాగ, నాగు పాముల్లా కన్పిస్తాయి. వాటిని త్రొక్కడానికి, అణగద్రొక్కడానికి బలమిచ్చువాడు ఆయనే.
ఇక,
ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు ఎందుకు?
నాతో వుండినవాడు నమ్మదగినవాడు తన రక్షణ వస్త్రాన్ని నాకిచ్చాడు
అంతిమ విజయం నాదే కదా!