దేహమెంత బలమైనా
జ్ఞానమెంత ఎక్కువున్నా
ఏదొకటి కొరతై బాధిస్తూనే
కొంచెం కొంచెంగా తినివేసే
కుష్టై కూర్చుంటుంది
ఎదురుచూసే మార్గాలన్నింటా
అంధకారం అలుముకుంటుంది
కాలికి తగిలే చిన్నదేదో
స్థితిని మార్చే మార్గానికి ద్వారం తెరుస్తుంది
మనసు మానైన నేనైనా
విఫలమైన ఫలితాలమధ్యున్న నయమానైనా
ప్రవక్తవైపు పయనించాల్సిందే
ప్రవక్త చెప్పేది
అయిష్టమైనదే కావచ్చు
కష్టమైనదే కావచ్చు
మురుగు పారుతున్న నదే అన్పించొచ్చు
విధేయతా మునకలు వేయాల్సిందే
ఒక్కసారికే ఏమీ కన్పడలేదా!
ఏడుసార్లు మునగాల్సిన అవసరం వుందేమో!
మునకేయడానికి సందేహమెందుకు?
నయమానును చూడు
కొత్తవెలుగు మోసుకెళ్తూ
మార్పునొందిన దేహంతో.
"ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు" కీర్తనలు 147:3
నా స్నేహితులారా, సిరియా సైన్యాధిపతియైన నయమానుకు కుష్టు వ్యాధి కలిగినప్పుడు. కష్టం అనిపించినా, ఎలీషా ప్రవక్త ద్వారా బయలుపరచబడిన దేవుని వాక్కుకు విధేయుడై నీటిలో ఏడుసార్లు ముగినవెంటనే ఆ వ్యాధినుండి విడుదల పొందగలిగాడు.
ఈ సంఘటనను లోతుగా ధ్యానిస్తే; దేవుడు మన జీవితాల్లో మనము విరిగి నలిగిన ప్రతీసారి ఎలా బాగుచేస్తాడో అర్థమవుతుంది. ప్రతీ ఒక్కరినీ బాగుచేసి పునరుద్ధరణ చేయగల శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది.
అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయగలిగిన క్రీస్తు పై విశ్వాసముంచి ఆయన మాటకు విధేయులమైతే, విస్వాసములో ఇంకో మెట్టుకు ఎదిగినట్టే.
ఇదే విస్వాస విజయము! ఆమేన్!