నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా...


  • Author:
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

మత్త 8:2 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.

మత్తయి సువార్త 5నుండి 7 అధ్యాయాలు ఏసుక్రీస్తు కొండమీద సుదీర్ఘ ప్రసంగం. ఆయన చుట్టూ వున్న జనసమూహమూ విన్నారు, కొండ దిగువన వున్న ఒక కుష్టరోగీ విన్నాడు.

కొండ దిగుతున్న యేసును అతడు ‘ఎదుర్కొనుట’, ‘మ్రొక్కుట’, ‘ప్రభువు’ అని సంభోదించుట ఆశ్చర్యం కలిగిస్తుంది.

నీకిష్టమైతే... నన్ను శుద్ధునిగా... చేయమని అడగటంలో క్రీస్తుపై ఆ భక్తునికున్న నమ్మకం కనిపిస్తుంది.

నేనెలా ఉంటే నీకిష్టమో – అలాగే ఉండటం నాకు ఇష్టం. (నేనిలాగే ఉండటం నీకు ఇష్టం అయితే నాకూ అదే ఇష్టం). పరిస్థతి ఏదైనా నువ్వే నా ప్రభువు, నీకే నా ఆరాధన; అని చెప్పగలగటం క్రీస్తుతో పెనవెసుకున్న అనుబంధం తెలుపుతుంది.

యేసు కుష్టరోగితో – నిన్ను బాగుచేయడం “నాకు ఇష్టమే, దైవ చిత్తముపై సంపూర్తిగా ఆధారపడిన ఒక భక్తుని సమర్పణతో కూడిన ఆవేదన ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఒక అద్భుతమైన, నిష్కల్మషమైన, త్యాగసహిత దైవ ప్రేమ ప్రజ్వలిస్తుంది" అని ముందుకు వస్తున్నాడు.

ప్రియ పాఠకా "నన్ను శుద్ధునిగా చేయగలవు" అని నమ్ముతున్నావా? నమ్మదగిన ఆ దేవుని శక్తిని ఆకళింపు చేసుకున్న హృదయనందనం వెళ్లి విరిసింది.
సంపూర్ణ భక్తి, పరిపూర్ణ విశ్వాసమూ ప్రబలుతున్న వేళ – “తనను ఘనపరచు వారిని తిరిగి ఘనపరచుటలో దేవుడు ఎప్పుడూ వెనుకాడడు”.

దేవుని శక్తిని ఎరుగని భక్తి, ప్రార్ధనలు ఇలా ఆలోచిస్తుంటాయి – అడిగాముగాని, “దేవుని చిత్తములో వున్నదో లేదో”... అని.

“అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము” అనగానే విశ్వాసంతో అవధులు లేని అనందాన్ని పొందాడు కుష్టురొగి, అద్భుతం చూశారు అవిశ్వాసులైన వారు.

భూలోకంలో పరలోకం ఏర్పడింది. అమ్యగోచరమై, జీవ మరణాల మధ్య నలుగుతున్న జీవన పోరాటంలో రెపరెపలాడింది విజయ బావుటా.
సమాజం నివ్వెరపోయిన పరిణామం ఇది.

నది సముద్రంలో అలల సుడిగుండంలో విలవిలలాడిన జీవిత నావ ఒక్కసారిగా సురక్షితంగా తీరం చేరిపోయిందంటే నమ్మశక్యమా !!
కాని, దేవునికి అది సాధ్యమే.

ప్రార్ధన : ప్రియ పరలోకపు తండ్రి, నేనిప్పుడు కలిగియున్న ప్రతి పరిస్థితీ నీకిష్టమైనదే ఐతే నన్నిలాగే ఉండనీ.
ప్రభువా, నా ఈ జీవితంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా;
అది సుఖమైనా, కష్టమైనా
“నీ చిత్త ప్రకారమే” జరుగునుగాక, ఆమెన్.