ఒక చిన్న బిడ్డ


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ఒక చిన్న బిడ్డ తన తల్లి స్వరాన్ని అతి తేలికగా గుర్తిస్తాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ స్వరాన్ని తెలుసుకుంటుంది.

బిడ్డ; గర్భములోనే తన తల్లి స్వరాన్ని వినడం మొదలుపెట్టి, పొత్తిళ్ళలో పాడే పాటలు, ఒడిలో చెప్పే కబుర్లతో పెరిగి పెదై ఎంత సమూహంలో ఉన్నా గుర్తించగలుగుతాడు.

తల్లి పరిచయం చేయడం ద్వారా తండ్రి, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య మొదలైన బంధువుల స్వరాలను తెలుసుకుంటాడు.

- హన్న తన కుమారుడైన సమూయేలును పాలు విడిచిన తరువాత యెహోవాకు ప్రతిష్టించినప్పటినుండి యెహోవా సన్నిధిని ఉండి ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు.

యెహోవా వాక్కు ప్రత్యక్షమవటం అరుదుగా ఉన్న రోజుల్లో ఒక రాత్రి బాలుడైన సమూయేలును దేవుడు పిలిచాడు, మూడుసార్లు మాట్లాడాడు. మాట్లాడిన ప్రతిసారి సమూయేలు ఆ స్వరం ఏలీదనుకున్నాడు.

అయితే దేవుడు సమూయేలుతో మాట్లాడాలని, ఆయన స్వరం వినిపించాలనుకుంటున్నాడని ఏలీ గ్రహించి సముయేలుతో "ఎవరైన నిన్ను పిలిచినయెడల యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పు" అని చెప్పమన్నాడు. సమూయేలు ఆలకించి, ఆఙ్ఞ ఇమ్మనగానే వినేవారి చెవులు గింగురుమనేలా దేవుడు మాట్లాడాడు.

నీవు ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నావా!

తల్లి స్వరాన్ని బిడ్డ ఏవిధంగా వినగలుగుతున్నాడో ఆ విధంగా దేవుని స్వరం వినగలుగుతున్నావా!

ఆయన నిన్ను పిలుస్తున్నాడు

మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు స్వరం వినగలుగునట్ట్లు ఈవిధంగా ప్రార్థించు -
దేవా! నాతో మాట్లాడు. ఆమేన్.