ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. యాకోబు 5:10
సువార్తికునికి కావలసిన మూడు అనివార్య నియమాలు -
1. ఓపిక 2. ఓపిక 3. ఓపిక.
అవునండి,
- భూదిగంతములకు వెళ్లి సువార్తను ప్రకటించి శిష్యులను చేయాలంటే పట్టుదలతో కూడిన ఓపిక కావాలి.
- రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరచాలంటే కాపరికి శ్రమలతో కూడిన ఓపిక కావాలి.
- సంపూర్ణ సమర్పణ కలిగి జీవించాలంటే ఆత్మీయతలో విశ్వాసంతో కూడిన ఓపిక కావాలి.
వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలం కోసం ఓపికతో కాచుకొనుచు కనిపెట్టునట్లు, క్రీస్తుతో అనుదిన మన ప్రయాణం విశ్వాస పరీక్షలో ఓర్పును పుట్టిస్తూ మహిమలో ప్రతిఫలం పొందు నిమిత్తం ఓపికతో కనిపెట్టుకొని జీవించాలి.
మహిమ, ఘనత, అక్షయతను వెదుకుతూ... సత్ క్రియను ఓపికగా చేసినప్పుడే కదా! నిత్యజీవానికి వారసులవుతాం!!
అనేక మిషనరి పరిచర్యలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు... భారత దేశం అంధకారంలో ఉందని గ్రహించిన విలియం కేరి కలకత్తాలో సువార్తను ప్రకటించి, ఎంతో శ్రమించి మన మాతృభాషల్లో బైబిలును తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఒక రోజు తన కార్యాలయం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. శ్రమంతా వృథా అయిందని నిరుత్సాహపడితే మన భాషలో బైబిలు దొరికేది కాదేమో కదా! ఓపికతో పునర్నిర్మించాడు కాబట్టే... ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మన భాషలో చదువుకోగలుగుతున్నాము.
మరణ పడకలో విలియం కేరి అన్న మాటలు నన్ను ఉత్తేజపరిచాయి "క్రీస్తు నుండి గొప్పకార్యములను ఎదురుచూడు ఆయన కొరకు గొప్ప కార్యములు చేయ ప్రయత్నించు". ఆ సువార్తికుని సంకల్పం, క్రీస్తు కొరకైన నా పట్టుదల, శ్రమతో కూడిన నా ఈ పరిచర్య ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ఆన్లైన్లో తెలుగులో అనేకులకు అందించాలనుకున్నాను, మొదటి ఆన్ లైన్ తెలుగు బైబిలు వెబ్ సైట్ SajeevaVahini.com గా మీముందుకు వచ్చాను.
నేనంటాను, క్రీస్తుతో శ్రమానుభవం ఓపిక అనే పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ ఓపిక దేవుని రాకడకొరకైన సిద్ధపాటు కలిగిస్తుంది. "నేడు కాదు - రేపు" అనే నిర్లక్ష్యం సిద్ధపడాలనుకుని కూడా ఓపిక చాలని బుద్ధిలేని కన్యకలను పోలి ఉంటుందని గ్రహించాలి. ఇంకెంతో దూరం లేదు ఆయన రాకడని గ్రహించి, ఓపికతో కనిపెట్టుకొని క్రీస్తుకొరకు శ్రమపడుటకు ప్రయత్నిద్దాం.
అనుభవం: అనుదినం సహించే క్రీస్తుతో శ్రమానుభవం మహిమలో నిత్యజీవానికి వారసత్వం.