యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

యేసు క్రీస్తు సిలువ లో పలికిన ఏడు మాటలు  - సప్తపలుకులు - Jesus 7 Words on Cross in Telugu

  1. యేసు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34
  2. “నేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువు” . లూకా 23:43
  3.  “అమ్మా,యిదిగో నీ కుమారుడు యిదిగో నీ తల్లి”. యోహాను 19:26
  4. “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. మార్కు 15:34
  5.  “నేను దప్పిగొనుచున్నాను”. యోహాను 19:28
  6.  “సమాప్తమైనది”. యోహాను 19:30
  7.  “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. లూకా 23:46

 

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - మొదటి మాట

అనుదిన మన ప్రార్ధనలో అనేక సంగతులు ఉంటూనే ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ప్రార్ధన, ప్రార్ధన భారాలు రెండు తగ్గిపోతాయి. అనుకోకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ప్రార్ధనలో ఎక్కువ భాగం మనకోసమే...చివర్లో కాస్త కుటుంబంకోసం లేదా అత్యవసరం ఉన్న సన్నిహితుల కోసం.

సిలువలో యేసు క్రీస్తు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు, బాధ తీవ్రంగా ఉన్నా, సిలువను వీక్షిస్తున్న తల్లికోసం లేదా శిష్యులకోసం ప్రార్ధన చేయలేదు. అంతేకాదు సిలువలో ఆయన మరణంద్వారా భవిష్యత్తు ప్రణాళికలో నిర్మించబడే సంఘంకోసం ప్రార్ధన చేయలేదు. ఆ వేదనకు బదులుగా, శత్రువుల కొరకు ప్రార్ధించాడు. ఆయన హింసకు కారణమైన వాళ్ళు కఠినంగా శిక్షించాలని కాదు గాని వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు.

శత్రువుల కొరకు ప్రార్ధించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గూర్చి మనం నేర్చుకోవలసిన వారమై యున్నాము. ఈ ప్రేమ ఎటువంటి శత్రువులనైనా మిత్రులుగా మార్చేయగలదు. దోషులు ఉండవలసిన స్థానంలో వారికి బదులుగా ఏ తప్పు చేయని వ్యక్తి ఆ స్థానంలో శిక్ష పొందడం... ఇదే ఆ సిలువ గొప్పతనం.

యేసు క్రీస్తు షరతులు లేని ప్రేమను నేర్పించాడు. ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకైనా క్షమించాలి. ఎటువంటి పాపాత్ములనైనా, చివరికి ఆయనను సిలువేసిన వారినైనా క్షమించగల ప్రేమా స్వరూపి. అసమానమైన ప్రేమ ఆ కలువరి ప్రేమ. అట్టి క్షమాపణ జీవితమే మనకు క్షమాపణ, విడుదల. మనంకూడా ఈ క్షమాపణ ప్రార్ధనను చేయ ప్రయత్నిద్దామా?

తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా 23:34

 

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - రెండవ మాట

మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు.

సర్వశక్తిగల సర్వాంతర్యామియైన దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సుళువుగా చేయగలడను మాట నమ్మని వారెవరు లేరు. అయితే, మనం అనుకున్నట్టు ఏ పనైనా జరగకపోయేసరికి... ప్రశ్నలు అనేకం. నేను ప్రార్ధించాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? నా ప్రార్ధన దేవుడు విన్నాడా? వినలేదా? అసలు దేవుడున్నాడా...? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో.

నేనంటాను, నా ప్రార్ధన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించే వారి కంటే, నా ప్రార్ధన దేవుడు వినేలా లేదు అని తనను తాను పరిశీలించుకునే వారు - మరియు - నా ప్రార్ధన దేవుడు వినికూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరిచేసుకునే వారంటేనే దేవునికి ఇష్టం.

ఈ రెండు స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు; వారు కూడా యేసుతో సిలువ వేయబడ్డారు. శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు కాని మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువని నమ్మి "నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకోమని" వేడుకున్నాడు.

మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆక్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. యేసు క్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు... ప్రశ్నలు అడుగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలే అడగలేదు. మారు మాట్లాడకుండా "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు" అని అన్నాడు. సిలువలో గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితిలో మనమున్నా...సిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసు క్రీస్తు క్రమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ.

నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను లూకా 23:43

 

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - మూడవ మాట

ముగ్గురు వ్యక్తులు.. మూడు వ్యక్తీకరణలు

యిదిగో నీ కుమారుడు...యిదిగో నీ తల్లి యోహాను సువార్త 19:26,27

1. కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ:
ప్రథమఫలమైన యేసు క్రీస్తును పరిశుద్దాత్మద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమయింది. ఆయన్ని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా చూడాలనుకుంది. ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని యెడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. కాని సిలువలో తన కుమారుణ్ణి చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయం పగిలిపోయింది. ప్రసవ వేదన కంటే భయంకరమైన సిలువ శ్రమ చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరై విలపించింది. కడవరకు కుమారుని కనిపెట్టుకొని ఉంది.

2. తల్లి పట్ల కుమారుని బాధ్యత:
కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వర్తించాలో యేసుక్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు. అంతేకాదు, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమను ఆజ్ఞ యెడల ఆయన విధేయత చూసి నేర్చుకోగలం. తలిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో ఇబ్బందిలో మనవంతు బాధ్యత కలిగియుండడం క్రీస్తును పోలి నడుచుకునే క్రైస్తవ జీవితం.

3. తనకు అప్పజెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు:
మనమాయనకు అందుబాటులో ఉండాలని దేవుడు పని అప్పజెప్పాడు గాని, దేవునికి అందుబాటులో ఉన్నవారికే పని అప్పజెప్పుతాడని గ్రహించాలి. ఈ అనుభవం కేవలం క్రీస్తును సంపూర్ణంగా అర్ధం చేసుకున్నవారికే సాధ్యం. యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాడు కాబట్టే సిలువకు దగ్గరగా, ఆయనకు అందుబాటులో ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పగానే తన యింట చేర్చుకొన్నాడు. క్రీస్తుకు ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే, అంత దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది, క్రీస్తుతో మన అనుబంధం పరిపూరణ్ణం అవుతుంది. ఈ అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుడు పని అప్పజెప్పుతాడు. అప్పజెప్పిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనలను అశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు.

 

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - నాలుగవ మాట

తండ్రి! ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా, స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే; తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూర దేశం వెళ్లాడు; దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధులపాలయ్యాడు, చివరకు పంది పొట్టు తినవలసి వచ్చింది. కాని ఇంటి దగ్గర తండ్రి ప్రతి రోజు గుమ్మము దగ్గర నిలబడి ఏదో ఒకరోజు నా కుమారుడు ఇంటికి తిరిగొస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పశ్చాత్తాపంతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరుగెత్తి కౌగలించుకొని, ముద్దుపెట్టుకొని తిరిగి తన ఇంట చేర్చుకున్నాడు.

అయితే, తన స్వరూపంలో తన పోలికలో సృష్టించిన మానవుడు దూరంగా వెళ్ళిపోతే, ఏరోజైనా తిరిగొస్తాడని వేచి చూస్తున్నాడు మనలను సృష్టించిన మన పరమ తండ్రి. మనమింకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరకు రమ్మని ప్రాధేయపడ్డాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనలను వేరు చేసిందో ఆ పాపమునుండి మనం వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గరవుతామనుకున్నాడు.

దేవుని అనాది కాల సంకల్పం; ఇప్పుడు క్రీస్తుతో మనలను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనలను స్వస్థపరచి విడుదల కలుగజేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వమానవాళిని నరకము నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయధనంగా తండ్రి కుమారుని చేయి విడిచేస్తే; మన పాప భారాన్ని మోస్తూ "నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని" యేసు ప్రాణము విడచి తండ్రికి మనలను దగ్గరగా చేర్చాడు.

ఇదే తండ్రి ప్రేమ!

క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మనకొరకేనని, కుమారుని మనకనుగ్రహించిన తండ్రి ప్రేమను గ్రహించి. మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు సిలువలో సంపూర్ణ రక్షణానుభవం పొంది తండ్రి దగ్గరకు చేరుకుందామా!

నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి మత్తయి 27:46

 

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - అయిదవ మాట

మదర్ థెరిస్సా తన ఆశ్రమంలోని ప్రార్ధనా గదిలో గోడపై "దప్పిగొనుచున్నాను" అనే ఆంగ్ల భాషాలో పదాలు వ్రాసియుండేవట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు "ఆత్మలకొరకైన దాహం".

యేసు క్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిక కలిగియున్నాడని గమనించగలం. "నేను దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదను" సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారి దాహమును తీర్చితే నాకు తీర్చినట్టేనని ప్రభువు బోధించాడు. అనగా మన సమాజంలో బలహీనులైనటువంటి వారికి మనవంతు సహాయం చేయడం ధన్యకరం. మదర్ థెరిస్సా ఆలోచనలు కూడా ఇవే.

దాహమునకు కొన్ని నీళ్లు ఇవ్వమని సమరయ స్త్రీతో యేసు పలికిన మాటలు తన శారీరక దప్పికను గూర్చి కాదు గాని ఆత్మీయ దప్పిక అని గమనించగలం. యూదులు మాత్రమే కాదు సమరయులు కూడా రక్షించబడాలనే ఉద్దేశం ఆ స్త్రీ ద్వారా సమరయుల మధ్య సువార్త ద్వారాలు తెరువబడ్డాయి. ఎప్పుడైతే రాబోయే మెస్సయ్య యేసయ్యేనని కనుగొన్నదో తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంది. సమరయయంతట సువార్తను ప్రకటించింది.

"నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని" సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు సిలువలో దప్పిగొనుచున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా!

సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు "దప్పిగొనుచున్నాను" అను మాట, రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆత్మీయ దప్పిక.

కలువరిలో క్రీస్తు పొందిన శ్రమ మనకొరకేనని గ్రహించి ఆ సిలువ యొద్దకు చేరి రక్షించబడిన అనుభవం కలిగియున్నమనం ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంతో సిలువలో క్రీస్తు దాహమును తీర్చినవారమవుతాము.
ప్రయత్నిద్దామా?


యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - ఆరవ మాట

"సమాప్తమైనది" అను మాట గ్రీకు భాషలో అర్ధం "పూర్తిగా చెల్లించెను".

యేసు క్రీస్తు సిలువలో ఈ మాటను పలికినప్పుడు, తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని". ఆయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొని; అనగా, మనం తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు సిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు.

మెస్సయ్యను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు సిలువ త్యాగంలో సంపూర్ణమై సమాప్తమైనది. నశించినదానిని వెదకి రక్షించాలనే తన మొదటి రాకడ ఉద్దేశం నెరవేర్చబడింది. తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. ఏ భేదమును లేక అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు యేసు క్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్నమనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది.

"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని." అను మాటను సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎట్లనగా, తండ్రి మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, యేసు క్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధపరచెనను కార్యము సిలువలో సమాప్తమైనది. సిలువలో శ్రమ, సిలువలో మరణంపై విజయం సమాప్తమైనది.

పరిపూర్ణమైనవాడు, అసంపూర్ణమైన మన కొరకు తన్ను తాను అర్పించుకొనుటకు సిద్ధపడ్డాడు. తద్వారా అసంపూర్ణులమైన మనం ఆయనలో పరిపూర్ణులం అవుతాము.ప్రస్తుతం నేను అసంపూర్ణుడను, క్రీస్తు సిలువ సంపూర్ణమవుతేనే, ఒకనాడు మహిమలో క్రీస్తుతో నేను పరిపూర్ణుడవుతాను. అప్పుడు యేసులాగే ఉంటాను. ఆమేన్!


యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - ఏడవ మాట

తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46

ఇంచుమించు ఉదయం 9 గంటలకు యేసు నేరస్తుడని తీర్పు ప్రకటించి సిలువవేయాలని సిద్ధమైంది వ్యతిరేకపు అధికారం. సమాజ బహిష్కరణ చేసి, పాళెము వెలుపట వధకు సిద్ధపరిచారు. శరీరమంతా గాయాలతో నిలువెల్లా నలుగ గొట్టి, మోమున ఉమ్మివేసి, పిడుగుద్దులు గుద్ది, దూషించి, అవమానించారు. యూదుల రాజువని తలకు ముళ్ళ కిరీటము పెట్టి అపహసించారు.

రక్తం ఏరులై పారింది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తసిక్తమైన శరీరం, అడుగు ఆపితే అహంకారుల ఆగడాలు... చెళ్ళున చీల్చే కొరడా దెబ్బలు, బలహీనమై... భారమైన సిలువను మోయలేక మోస్తూ మోస్తూ, హాహాకారాల ఊరేగింపు... గొల్గొతా కొండకు చేరింది 6 గంటల సిలువ ప్రస్థానం.

సిలువను వీక్షిస్తున్న కళ్ళన్నీ నిప్పు కణికలై లేస్తుంటే, విస్తుపోయిన క్షణం సర్వజగతికి - దేవునికి మధ్య తెర చినిగింది. తులువల మధ్య వ్రేలాడిన ప్రేమ బావుటాకు మేకులు కొడితే... క్షమించింది, బాధ్యత గుర్తుచేసింది. విధేయతకు అర్ధం తెలియజేస్తూ రక్షణ ద్వారాలు తెరుచుకున్నాయి. నా శరీరిరం నీకొరకేనని, నా రక్తం మీ అందరి కొరకేనని ధారపోసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి చివరకు తన ప్రాణాన్ని మనకొరకు అర్పించాడు యేసు క్రీస్తు.

సముద్రమంత సిరాతో రాసినా వర్ణించలేని ఆ క్రీస్తు ప్రేమ మన ఊహలకే అందనిది ఈ సిలువ త్యాగం. మన పాప శాప దోషములు ఆయన్ని సిలువేస్తే మౌనంగా భరించగలిగింది ఆ అమర ప్రేమ.

సమూల మార్పే లక్ష్యంగా, చివరి బొట్టువరకు కార్చిన రుధిరం మన రక్షణకు ఆధారమైతే; విరిగి నలిగిన హృదయాలతో ఆయన్ను చేరుకోలేకపోతే ఆ సిలువ సమర్పణకు అర్థమేముంది?

విలువలేని మన జీవితాలకు విలువైన తన జీవితం సిలువలో అర్పించాడు. వెలపెట్టిన ఆయన ప్రాణం మనకు ఉచితముగా రక్షణనిస్తే; రక్షించబడి, మన ఆత్మలను క్రీస్తుకు అప్పగించుకొనగలిగితేనే ఆ త్యాగానికి, సిలువకు అర్ధం.

ప్రభువా... నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆమెన్!